సాక్షి,న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌తో కరోనా వైరస్ తీవ్రత భారీగా తగ్గిపోతుందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకినప్పటికీ ఆసుపత్రిలో చేరే అవకాశాలు 75–80 శాతం తగ్గుతున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలిందని గుర్తుచేసింది. అలాగే ఆక్సిజన్ అవసరం కూడా 8% తగ్గిపోతున్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మీడియాతో మాట్లాడారు. ‘టీకా తీసుకున్న వారిలో ఐసీయూలో చేరాల్సిన అవసరం 6 శాతం, వైరస్ బారినపడే అవకాశం 94శాతం మేర తగ్గుతున్నట్లు హై రిస్క్ ఉన్న ఆరోగ్య కార్యకర్తలపై జరిపిన అధ్యయనంలో వెల్లడైందన్నారు. వ్యాక్సినేషన్‌లో ఆరోగ్య కార్యకర్తలకు కేంద్రం మొదటి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వేలాది ప్రాణాలను ప్రమాదం నుంచి రక్షించినట్లు చెప్పారు.
టీకా తీసుకున్న వారిలో 7 వేల కేసులకు గాను కేవలం ఒక్క మరణం మాత్రమే సంభవిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఒక్కరు కూడా వేరే అనారోగ్య కారణాలతోనే చనిపోతున్నట్లు తేలిందని చెప్పారు. ఇతర దేశాల్లో చేపట్టిన అధ్యయనాల్లోనూ ఇదే రకమైన ఫలితాలు నమోదయ్యాయని తెలిపారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 18 ఏళ్లు పైబడిన వారికి, 18 ఏళ్ల లోపు వారికి దాదాపు ఒకే విధంగా ఉందన్నారు. చిన్నారులు కోవిడ్ బారిన పడినప్పటికీ వారిలో లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. చాలా దేశాల్లో స్కూళ్లు ప్రారంభమయ్యాక కేసులు మళ్లీ పెరిగిన ఉదాహరణలున్నాయని పాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment