కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ.. ఆంక్షలు రాబోతున్నాయా? | Energy Crisis Deepens, India Urges Savings As Global Nations Adopt Strict Fuel Control Measures, Details Inside | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ.. ఆంక్షలు రాబోతున్నాయా?

May 13 2026 7:12 AM | Updated on May 13 2026 10:45 AM

Central cabinet meeting today over Fuel Conservation

పెట్రో ధరల పెంపుపై ప్రకటన చేసే చాన్స్‌

ప్రధాని పొదుపు మంత్రం పఠించిన వేళ 

దేశంలో ఇంధన వినియోగంపై ఆంక్షలు విధించే అవకాశం

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఎగదోసిన చమురుసంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారతీయులు సైతం తమ వంతు బాధ్యతగా పొదుపు మంత్రం పఠించాలని గత రెండ్రోజుల్లో ఇటు తెలంగాణలో, అటు గుజరాత్‌లో ప్రధాని మోదీ హితబోధ చేశారు. మోదీ ‘పొదుపు’ ప్రసంగాల వేళ బుధవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్‌ భేటీకానున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చనే వార్తలు ఇప్పుడు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

పెట్రో ధరల పెంపుతో పాటు మరికొన్ని పొదుపు చర్యలపై ప్రధాని బుధవారం ప్రకటన చేసే అవకాశముంది. రెండ్రోజులుగా ప్రధాని పొదుపు మంత్రం ఉపదేశిస్తుండటంతో విపక్షాల నుంచి వెల్లువెత్తిన విమర్శలపై ప్రభుత్వం తరఫున ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) మంగళవారం దీటుగా స్పందించింది. చమురు సంక్షోభం దెబ్బకు డజన్ల కొద్దీ దేశాలు అనుసరిస్తున్న పొదుపు చర్యలనే ప్రధాని సూచించారని సోదాహరణంగా వివరించింది. అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) ఇటీవల ఇచ్చిన నివేదికలను బహిర్గతంచేసింది. దీనిప్రకారం 40 దేశాలు ఇంధన వినియోగం, ప్రజల వాహనాల అతి వాడకం, ఇతర రాకపోకలపై ఆంక్షలు విధించాయి. 

మూడు దేశాలు తమ ప్రజలకు ఎల్పీజీ వాడకం తగ్గించుకోవాలని, సిలిండర్‌ను సగం వరకే నింపుకోవాలని సూచించాయి. ఎలక్ట్రిక్‌ లేదా పీఎన్‌జీకి మారాలని హితబోధ చేశాయి. 18 దేశాలు ప్రజల రవాణాపై పరిమిత ఆంక్షలు విధించాయి. ఇంటి నుంచి పని(వర్క్‌ ఫ్రం హోం)చేయాలని 13 దేశాలు సూచించాయి. ఇల్లు, ఆఫీసుల్లో తక్కువ లైట్లు ఆన్‌చేయాలని, ఏసీలను 25 డిగ్రీసెల్సియస్‌ కంటే తక్కువ పాయింట్లకు పెట్టుకోవద్దని పలు దేశాలు ప్రజలకు సూచించాయి. స్కూళ్లు, కాలేజీలు మూసేసి విద్యార్థులకు కేవలం ఆన్‌లైన్‌లోనే పాఠాలు బోధించాలని, తద్వారా విద్యార్థులు, సిబ్బంది, టీచర్ల ప్రయాణాలకు ఇంధనం ఆదా అవుతుందని పలు దేశాలు సూచించాయి.

పలు దేశాల్లో పొదుపు చర్యలు ఇలా..
ఇంధన వినియోగంపై సూచనలు
పెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గాలంటే ప్రభుత్వ, ప్రైవేట్‌ సిబ్బంది కార్యాలయాలకు రాకుండా ఆపాలని పలు దేశాలు నిర్ణయించాయి. అందుకోసం పాకిస్తాన్‌ వారంలో నాలుగు రోజులు వర్క్‌ ఫ్రమ్‌ హోంను ప్రవేశపెట్టింది. మొత్తం సిబ్బందిలో సగం మంది ఇంటి నుంచే పనిచేయాలని సూచించింది. ఇండోనేసియాలో శుక్రవారాలు ఇంటి నుంచే పనిచేయాలి. కాంబోడియా, లావో, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం, పెరూ, ఈజిప్ట్‌ సైతం ఇలాంటి చర్యలే చేపట్టాయి.

ఏసీ కూలింగ్‌పై పరిమితులు
ప్రైవేట్‌ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో ఏసీలను 25 డిగ్రీ సెల్సియస్‌ కంటే తక్కువ పాయింట్‌ పెట్టొద్దని బంగ్లాదేశ్‌ కరాకండీగా చెప్పేసింది. సింగపూర్‌(25), కాంబోడియా (24–25), మలేసియా(25), శ్రీలంక(26), థాయిలాండ్‌(26) అదే బాటలో పయనించాయి. జోర్డాన్‌ ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వాడకంపై నిషేధం విధించింది.

విద్యాసంస్థల నిర్వహణపై..
బంగ్లాదేశ్‌లో అన్ని విశ్వవిద్యాలయాలనూ మూసేశారు. శ్రీలంకలో బుధవారం సెలవులు అమలుచేస్తున్నారు. పాకిస్తాన్‌లో స్కూళ్లు, కాలేజీల్లో 100 శాతం ఆన్‌లైన్‌ విధానం అమలుచేస్తున్నారు.

విద్యుత్‌ వాడకం తగ్గింపు..
5స్టార్‌ రేటింగ్‌ వంటి అత్యంత తక్కువ విద్యుత్‌తో పనిచేసే ఉపకరణాలనే వాడాలని పలు దేశాలు సూచిస్తున్నాయి. వంట, స్నానం కోసం గ్యాస్‌తో నడిచే బాయిలర్లకు బదులు సోలార్‌తో పనిచేసే వ్యవస్థలను వాడాలని నెదర్లాండ్స్‌ ప్రజలకు సూచించింది. థాయిలాండ్‌లో తక్కువ అంతస్తులున్న ఆఫీసుల్లో లిఫ్ట్‌లను ఆపేసి మెట్లు ఎక్కాలని సూచిస్తున్నారు. వీధి దీపాల విద్యుత్‌ కోతలను పెంచారు. ఎల్పీజీ ఆధారిత గీజర్‌లకు బదులు సోలార్‌ గీజర్‌లు వాడాలని బ్రిటన్‌ సూచించింది. 

రవాణాపై ఆంక్షలు..
దక్షిణకొరియాలో వాహనాలను సరి, బేసి సంఖ్య ఆధారంగా వేర్వేరు రోజుల్లో అనుమతిస్తున్నారు. శ్రీలంకలో ఆరోజుకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ అయిన వాహనమే రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. రోజు విడిచి రోజు వాహనం రోడ్డు మీదకు తేవాలని మయన్మార్‌ సూచించింది.  బయోడీజిల్, ఎలక్ట్రిక్‌ వాహనాలనే రోడ్లపైకి అనుమతిస్తామని ఇండోనేసియా తెలిపింది. 

సోలార్‌ వ్యవస్థల వినియోగం..
సోలార్‌ వ్యవస్థలను ఇళ్లు, కార్యాలయాలపై బిగించుకోవాలని, ఎల్‌ఈడీ లైట్లను వాడాలని బ్రిటన్, నెదర్లాండ్స్‌ సూచించాయి. సోలార్‌ ఎనర్జీ బిగించుకుంటే ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తామని స్పెయిన్‌ ప్రకటించింది. 

పొదుపు చర్యలు..
ఎల్పీజీ సిలిండర్‌లను సగమే నింపి ఇస్తామని నేపాల్, మాల్దీవుల ప్రభుత్వాలు స్పష్టంచేశాయి. పాకిస్తాన్‌ రాత్రి 8 గంటల తర్వాత మార్కెట్‌ సముదాయాలకు కరెంట్‌ను కట్‌ చేస్తోంది. రాత్రి 10 గంటల తర్వాత ఆహారం, తినుబండారాల దుకాణాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపేస్తోంది. భారీ ప్రకటనలు ఉండే హోర్డింగ్, బిల్‌బోర్డ్‌లకు రాత్రిళ్లు ఈజిప్ట్, శ్రీలంక కరెంట్‌ను నిలిపేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement