కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వైద్యురాలిపై అత్యంత క్రూరంగా దాడి చేసి చంపిన కిరాతకుడికి ఉరిశిక్ష విధించాలంటూ ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి..
ఈ క్రమంలో తాజాగా హత్యాచారం చోటుచేసుకున్న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వద్దకు కేంద్ర బలగాలు భారీగా చేరుకున్నాయి. విమానాశ్రయాలు, పార్లమెంట్‌లకు రక్షణగా ఉండే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఉన్నతాధికారులు హాస్పిటల్ వద్ద గస్తీ కాసేందుకు చేరుకున్నారు.
కోల్‌కతా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన మరుసటి రోజు ఈ పరిణామం వెలుగుచూసింది. హత్యాచారం ఘటన తర్వాత ఆసుపత్రి వద్ద భారీ నిరసనలు చోటుచేసుకుంటున్న తరుణంలో కేంద్ర బలగాలను మోహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఆసుపత్రికి చేరుకున్న అనంతరం సీనియర్ సీఐఎస్‌ఎఫ్ అధికారి కే ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించేందుకు ఆసుపత్రి వద్దకు వచ్చినట్లు తెలిపారు. తమ పని తాము చేస్తామని, మిగతా విషయాలు సీనియర్ అధికారులు తెలియజేస్తారు పేర్కొన్నారు.
కాగా ఆగస్ట్ 15 తెల్లవారుజామున ఒక గుంపు ఆసుపత్రిపై దాడి చేసి రెండు అంతస్తులలోని వైద్య పరికరాలు, సామాగ్రిని ధ్వంసం చేయడంపై సుప్రీంకోర్టు బెంగాల్ పోలీసులకు చీవాట్లు పెట్టింది. ఆసుపత్రి విధ్వంసానికి పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడింది.
మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్ పరీక్ష
మరోవైపు.. ఆర్జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష( లై డిటెక్టర్ పరీక్ష) చేసే అవకాశాలు ఉన్నాయి. కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు.. పాలీగ్రాఫ్ టెస్టుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 9వ తేదీన వైద్యురాలి శరీరం సెమీనార్ హాల్‌లో పడి ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత రెండు రోజులకు ప్రిన్సిపాల్ ఘోష్ రాజీనామా చేశారు. ఇప్పటికే పలుమార్లు ఆయన .. సీబీఐ విచారణకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment