బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎన్నిక చెల్లదంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీంతో పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా కోర్టు కంగనాకు నోటీసులు జారీ చేసింది. మండి లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎన్నికైన సంగతి తెలిసిందే.
అయితే కంగనా ఎన్నిక చెల్లదని, ఆమె ఎన్నికను రద్దు చేయాల్సిందేనని కిన్నౌర్‌కు చెందిన లాయక్ రామ్ నేగి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను(రామ్ నేగి) వేసిన నామినేషన్ పత్రాన్ని అసంబద్ధంగా తిరస్కరించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని కంగనా రనౌత్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ ఆదేశాలు జారీ చేశారు.
మండీ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన లాయక్ రామ్ నేగి తాను పోటీచేసేందుకు నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ, తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యిందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మండి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు చెల్లవని, అందుకే కంగనా రనౌత్ ఎన్నికను రద్దు చేయాలని కోరారు.లాయక్ రామ్ నేగి అటవీ శాఖ మాజీ ఉద్యోగి. నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారికి ‘నో డ్యూస్’ సర్టిఫికేట్‌ను కూడా సమర్పించారు. విద్యుత్, నీరు, టెలిఫోన్ తదితర శాఖల నుంచి ఎలాంటి బకాయిలు లేవని చూపేందుకు ఆయనకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒకరోజు సమయం ఇచ్చారు.
అయితే నేగి ఈ సర్టిఫికెట్లను గడువులోగా సమర్పించినప్పటికీ, రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించినట్లు నేగి ఆరోపిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 100 ప్రకారం.. నేగి దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా తిరస్కరించినట్లు రుజువైతే, మండీ లోక్‌సభ ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించే అవకాశాలున్నాయి. మండి లోక్‌సభ స్థానం నుంచి రనౌత్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment