రూ.8 లక్షల రివార్డు.. చెల్లి కోసం లొంగిపోయాడు | Chhattisgarh Naxal Surrenders After Sister Appeal On Raksha Bandhan | Sakshi

రాఖీ కట్టిన చెల్లి.. జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్‌

Aug 3 2020 7:59 PM | Updated on Aug 3 2020 8:05 PM

Chhattisgarh Naxal Surrenders After Sister Appeal On Raksha Bandhan - Sakshi

రాయ్‌పూర్‌: రాఖీ పండగ అనేది ప్రధానంగా తోబుట్టువుల పండుగ. ఒకరి క్షేమం ఒకరు కోరుతూ జరుపుకునే పండుగ. ఆడపడుచు.. నిండు నూరేళ్లు తన సోదరులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాఖీ కడుతుంది. రక్ష కట్టించుకున్న సోదరులు జీవితాంతం వారికి తోడుగా ఉంటానని మాటిస్తారు. ఈ రాఖీ పండుగ నాడు.. రక్షా బంధన్‌ గొప్పతనాన్ని నిజం చేసే సంఘటన ఒకటి చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. నక్సలైట్‌గా మారి.. ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్న ఓ అన్నను.. రాఖీ కట్టి.. జనజీవన స్రవంతిలో కలిసేలా చేసింది అతడి సోదరి. వివరాలు.. దంతెవాడ జిల్లా పల్నార్ గ్రామానికి చెందిన మల్లా అనే వ్యక్తి తన 12 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. (రక్షాబెహన్‌)

గత 14 ఏళ్లుగా మల్లా ఇంటికి తిరిగి రాలేదు. దాంతో అతని చెల్లెలు లింగేతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. తన అన్నయ్య ఇంటికి రావాలని ఎందరో దేవుళ్లకు మొక్కింది లింగే. ఈ క్రమంలో 2016లో మల్లా, ప్లాటూన్ డిప్యూటీ కమాండర్‌ అయ్యాడు. భైరవ్‌ఘడ్ ఏరియా కమిటీ నక్సలైట్ కమాండర్‌గా పనిచేస్తున్న మల్లా తలపై పోలీసులు 8 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. సోదరుడి క్షేమం కోసం ప్రార్థిస్తోన్న లింగే.. దీనితో మరింత భయాందోళనకు గురయ్యింది. హిట్‌ లిస్ట్‌లో చేరిన తన సోదరుడు ఏదో ఒక రోజు పోలీసుల కాల్పుల్లో మరణిస్తాడని.. అలా కాకుండా తన అన్నను కాపాడుకోవాలని నిర్ణయించుకుది. (సోదరులకు రక్షాపూర్ణిమ)

ఈ క్రమంలో లింగే రక్షాబంధన్ సందర్భంగా సోదరుడు మల్లాను కలిసింది. రాఖీ కట్టి.. పోలీసులకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నో ఏళ్ల తర్వాత సోదరిని కలుసుకున్న లింగే ఆమె కట్టిన రాఖీకి విలువ ఇచ్చాడు.  నక్సలిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించాడు. దాంతో మల్లాకు పునరావాసం కల్పిస్తామని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement