
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దులో చైనా ఆగడాలు రోజు రోజుకి పెచ్చు మీరుతున్నాయి. కొద్ది నెలలుగా లద్ధాఖ్ నుంచి అరుణాచల్ వరకు ఏదో ఒక చోట ఉద్రిక్తతలు పెంచే కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఏకంగా మూడు గ్రామాలనే ఏర్పాటు చేసింది. 960 కుటుంబాలను(దాదాపు 3,222 మంది) వలంటరీ బేసిస్‌పై ఈ గ్రామాలకు తరలించింది. భారత్, చైనా, భూటాన్ దేశాల జంక్షన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌కు పశ్చిమాన ఉన్న బమ్ లా పాస్‌కు 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామాల ను నిర్మించడం గమనార్హం. కాగా, అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ కొన్ని దశాబ్దాలుగా చైనా వాదిస్తున్న విషయం తెలిసిందే.
(చదవండి : యూఎస్ తర్వాత ఆ రికార్డు చైనాదే..)
డోక్లామ్ సైనిక ఘర్షణ జరిగిన స్థలానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో చైనా గ్రామాల నిర్మాణాన్ని ఈ ఇమేజీలు కళ్ళకు కడుతున్నాయి. లద్దాఖ్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలోనే చైనా ఈ మూడు గ్రామాలను నిర్మించినట్లు శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఆ ప్రాంతంలో 20 నిర్మాణాలతో తొలి గ్రామాన్ని నిర్మించినట్లు ప్లానెట్ ల్యాబ్స్ నుంచి పొందిన ఫొటోలు చూస్తే తెలుస్తోంది.
ఆ తర్వాత నవంబర్ 28 నాటికి ఆ పక్కనే మరో రెండు గ్రామాలు వెలిశాయి. అందులో ఒక గ్రామంలో 50 వరకు నిర్మాణాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామాలను ఒక్కో కిలోమీటర్ దూరంలో అధునాతన రోడ్లతో అనుసంధానించారు. 2017 లో భారత, చైనా దేశాల మధ్య డోక్లామ్ ఘర్షణ చాలా రోజులపాటు జరిగింది. ఇటీవల లడాఖ్ నియంత్రణ రేఖ వద్ద ఉభయ దేశాల మధ్య ఎనిమిది దఫాలుగా చర్చలు జరిగినా ఉద్రిక్తతలు తగ్గని విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment