
ఇంఫాల్: శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చాలని ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ (ఏఎంసీఓ) కోరింది. ఫిబ్రవరి 27న జరగబోయే మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలను మరోరోజు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం క్రైస్తవులకు ప్రార్థన దినం అయినందున పోలింగ్ తేదీని మార్చాలని పేర్కొంది. ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో ఎప్పుడు పోలింగ్ నిర్వహించినా తమకు అభ్యంతరం లేదని తెలిపింది. తమ మనోభావాలను గౌరవించి మొదటి దశ పోలింగ్ తేదీని మార్చాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది.
కాగా, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు పంజాబ్ ఎన్నికలను ఈసీ వాయిదా వేసిన సంగతి విదితమే. గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా ఫిబ్రవరి 14న జరగాల్సిన పోలింగ్‌ను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.
60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27, మార్చి 3న మణిపూర్‌లో పోలింగ్ నిర్వహించనున్నారు. 30 లక్షల మంది జనాభా కలిగిన మణిపూర్‌లో క్రైస్తవులు 41.29 శాతం ఉన్నారు. ( ఆమె మౌనం.. ఎవరికి లాభం!)