కోల్‌కతా: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. దీనిపై వ్యూహరచన చేసేందుకు 15న ఢిల్లీలో భేటీ అవుదామంటూ ఆహ్వానించారు. ఈ మేరకు 22 విపక్ష పార్టీలకు దీదీ లేఖలు రాశారు. ‘‘కాన్‌స్టిట్యూషన్ క్లబ్బులో మధ్యాహ్నం మూడింటికి జరిగే సమావేశంలో ఆయా పార్టీల అధినేతలందరం హాజరవుదాం’’ అని కోరారు.
మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, పంజాబ్ ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలతో పాటు కొన్నాళ్లుగా ఉప్పూనిప్పుగా ఉంటున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కూడా ఆహ్వానం పంపడం విశేషం. ‘‘బీజేపీ విభజన రాజకీయాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రపతి ఎన్నిక సరైన అవకాశం. ప్రగతిశీల భావాలున్న ప్రతిపక్ష పార్టీలందరం కలిసి ఈ దిశగా వ్యూహరచన చేసుకుందాం. జాతీయ రాజకీయాల్లో ఎలా ముందుకెళ్లాలో చర్చించుకుందాం. ప్రజాస్వామ్యం సమస్యల్లో ఉన్నప్పుడు విపక్ష గళాలన్నీ ఏకమై అణచివేతకు గురవుతున్న, ప్రాతినిధ్యం కరువవుతున్న సామాజిక వర్గాలవైపు నిలుద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు.
ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థల ద్వారా విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని దుయ్యబట్టారు. సమాజంలో అది తెస్తున్న చీలికల వల్ల అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లిందన్నారు. ‘‘ఇలాంటి వేళ దేశాధ్యక్షుడు, మన ప్రజాస్వామ్య పరిరక్షకుడు అయిన రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు వచ్చిన గొప్ప అవకాశమిది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం’’ అని కోరారు. మమత లేఖలను బీజేపీ తేలిగ్గా తీసుకుంది. ఈ సమావేశంతో ఒరిగేదేమీ లేదంటూ పెదవి విరిచింది. ‘‘2017లోనూ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఇలాంటి ప్రయత్నాలే చేశారు. చివరికేమైందో అందరికీ తెలుసు’’ అని బెంగాల్ బీజేపీ నేత సమిక్ భట్టాచార్య అన్నారు. ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
ఐక్యతకు భంగం: ఏచూరి
మమత తలపెట్టిన భేటీ వ్యతిరేక ఫలితాలకే దారి తీస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 15వ తేదీనే సోనియాగాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులు సమావేశమవుతున్నారని గుర్తు చేశారు. ‘‘మమత కూడా అదే రోజు సమావేశం పెట్టడం సరికాదు. ఆమె ఏకపక్ష నిర్ణయం విపక్షాల ఐక్యతకు భంగకరం’’ అన్నారు.
ఉమ్మడి అభ్యర్థిని నిలబెడదాం: కాంగ్రెస్
విభేదాలను పక్కనబెట్టి ఉమ్మడి అభ్యర్థిని నిలపాలన్నదే కాంగ్రెస్ అభిప్రాయమని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. కాంగ్రెస్ ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రతిపాదించబోదని ఆయన చెప్పడం విశేషం.
ఇది కూడా చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్
Comments
Please login to add a commentAdd a comment