పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు(ఎమ్మెల్సీ) పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి అందించారు. నితీష్ కుమార్‌తో పాటు జేడీయూకు చెందిన ఖలీద్ అన్వర్, జితిన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎం) కుమారుడు సంతోష్ సుమన్ సైతం శాసనమండలికి నామినేషన్లు దాఖలు చేశారు.
నితీష్ వెంట ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, లలన్ సహా పలువురు అధికార ఎన్డీయేకు చెందిన సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఈ ఏడాది మే తొలి వారంలో నితీష్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. ఆయనతోపాటు రబ్రీదేవి(ఆర్జేడీ), షానవాజ్ హుస్సేన్(బీజేపీ), సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), ప్రేమ్ చంద్ర మిశ్రా(కాంగ్రెస్), సంతోష్ కుమార్ సుమన్(హెచ్ఏఎం-ఎస్), మంగళ్ పాండే(బీజేపీ), రామ్ చంద్ర పుర్వే(ఆర్జేడీ), ఖలీద్ అన్వర్(జేడీ-యూ), రామేశ్వర్ మహతో(జేడీ-యూ), సంజయ్ పాశ్వాన్(బీజేపీ) పదవీ కాలం కూడా మే నెలలో ముగియనుంది.
చదవండి: 'సందేశ్‌ఖాలీ' కేసులో సుప్రీంకోర్టుకు దీదీ సర్కార్
ఈ నేపథ్యంలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 14 చివరితేదీ. మార్చి 21వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.
ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం.. ఆరు స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. మిగతా ఐదు స్థానాలు మహాఘటబంధన్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ తాము నాలుగు స్థాన్లాలో పోటీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. మరో స్థానాన్ని మిత్రపక్షం హిందూస్థాన్ ఆవాస్ మోర్చాకు కేటాయించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment