సాక్షి, ఢిల్లీ : దేశంలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులతో పోలిస్తే ఎగుమతి సగటున 1 శాతం కూడా ఉండటం లేదని వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలో వెల్లడైంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాల్సిన తక్షణ అవసరం ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అందుకోసం తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ స్థాయీ సంఘం 154వ నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నివేదికను స్థాయీ సంఘం చైర్మన్ వి.విజయసాయి రెడ్డి.. రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడుకు అందించారు.
రైతులు యాంటిబయాటిక్స్‌ను నియంత్రిత రీతిలో వినియోగించేందుకు అవసరమైన ఎక్స్‌టెన్షన్ సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ సిఫార్సు చేసింది. మత్స్య ఉత్పాదనల నాణ్యత, దిగుబడులే లక్ష్యంగా పరిశోధన, అభివృద్ధి చేపట్టాల్సిందిగా పేర్కొంది. దేశంలో ఏటా 800 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక పొగాకు సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. పొగాకు ఉత్పాదనల ద్వారా ఏటా (2018-19 గణాంకాల ప్రకారం) సుమారు 6 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడం జరుగుతోంది. కానీ పొగాకు సాగుకు మాత్రం తగినంత ప్రోత్సాహం అందడం లేదని కమిటీ అభిప్రాయపడింది. (ఆర్‌బీఐ పేరుతో కాలయాపన : సుప్రీం ఆగ్రహం)
పొగాకు సాగులో ఎఫ్‌డీఐని అనుమతించాలి
2017లో ప్రకటించిన ఎఫ్‌డీఏ విధానం ద్వారా కాఫీ, టీ, రబ్బర్, యాలకులు వంటి ప్లాంటేషన్ పంటల సాగులో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. కానీ పొగాకు పంటకు ఆ వెసులుబాటు లేదు. కాబట్టి పొగాకు సాగులో కూడా ఎఫ్‌డీఐకి అనుమతించాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఎఫ్‌డీఐ ద్వారా సాగు చేసే పొగాకును ఆక్షన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మాత్రమే మార్కెట్ చేయాలన్న నిబంధన ఉండాలని సిఫార్సుల్లో పేర్కొంది. సిగరెట్ల అమ్మకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ 1 శాతం సుంకం విధించి ఆ మొత్తాన్ని పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం వినియోగించాలన్న టుబాకో బోర్డు సూచనను కమిటీ ప్రశంసిస్తూ ఈ దిశగా చర్యలు తీసుకోవలసిందిగా వాణిజ్య మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. దీని వలన మార్కెట్ సంక్షోభ పరిస్థితులలో రైతుల ఉత్పత్తులకు న్యాయమైన ధర లభిస్తుందని ఆయన చెప్పారు. (నా జీవితంలో మర్చిపోలేని ఘటన..)
Comments
Please login to add a commentAdd a comment