ఢిల్లీ: ఇండియా కూటమి మిత్రపక్షాల ఒత్తిడితో కాంగ్రెస్ ఎట్టకేలకు సీట్ల పంపకాలపై మరో నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సీట్ల పంపకం, సర్దుబాట్ల కోసం పార్టీ నేతలు మిత్రపక్షాలకు చేరువవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ వివిధ ప్రతిపక్ష పార్టీల అధినేతలకు ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. అంతేకాకుండా అవసరమైతే, ప్రతిపక్ష నేతలను కూడా కలవడానికి కాంగ్రెస్ నేతలు రాష్ట్రాలకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
ఇక, జనవరి 14న ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు ముందే సీట్ల పంపకాల ఒప్పందాలను ఖరారు చేయాలని పార్టీ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ జోడో న్యాయ్ యాత్రతోనే కాంగ్రెస్ తన ప్రచారాన్ని కొనసాగించాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల జాబితాను కూడా త్వరగా ఖరారు చేయాలని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు.
కాంగ్రెస్ Vs టీఎంసీ
ఇదిలా ఉండగా.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. కూటమిలో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. బెంగాల్లో సీట్ల పంపకంపై కాంగ్రెస్, టీఎంసీ మధ్య మాటల యుద్ధం తలెత్తింది. ఒంటరి పోరుకు ఇరు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. మమత దయాదాక్షిణ్యాలు తమకు అవసరం లేదని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామినవుతానని తొలుత మమతా బెనర్జీయే ప్రాతిపాదించారని గుర్తు చేశారు. మమతా బెనర్జీ అసలు రూపం బయటపడింది. ఒంటరిగా పోటీ చేసి గతంలో కంటే అధిక స్థానాలు గెలిచే సత్తా మాకు ఉంది. దానికి మేం సిద్ధంగా కూడా ఉన్నామని స్పష్టం చేశారు.
మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదని టీఎంసీ నేత కునాల్ ఘోష్ ఎద్దేవా చేశారు. అధీర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేసి అఖండ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఇండియా కూటమిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్కు టీఎంసీ మద్దతిస్తోంది. సీట్లపై మమతా బెనర్జీ తుది నిర్ణయం తీసుకుంటారు. మమతా బెనర్జీ రెండు సీట్లు ఆఫర్ చేస్తే తమకు 8 కావాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. అసెంబ్లీలో 294 స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో మీరు ఒక్క చోట కూడా ఎందుకు గెలవలేకపోయారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment