చిక్కబళ్లాపురం: వైద్యవిద్య చదివి డాక్టర్ కావాలని వెళ్లిన వందల మంది కన్నడిగ విద్యార్థులు ఉక్రెయిన్‌లో పడరాని పాట్లు పడుతున్నారు. బాంబుల మోతలు, క్షిపణి దాడులు, ట్యాంకుల గర్జనలతో అల్లాడుతున్న ఆ దేశంలో క్షణమొక యుగంలా గడిపినట్లు విద్యార్థులు ఆ చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. చిక్క జిల్లాలోని పాతపాళ్యకు చెందిన ఎస్‌ఐ కూతురు లిఖిత ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి స్వస్థలానికి చేరుకుంది. ఒదేస్స నగరంలో ఆమె ఎంబీబీఎస్ నాలుగో ఏడాది చదివేది. ఉక్రెయిన్‌లో ఎన్నో కష్టాలు పడ్డామని తెలిపింది.
యుద్ధం ఆరంభం కాగానే యూనివర్సిటీ వారు ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించారు. దీంతో అక్కడే ఉండిపోయింది. భారత జెండాలను పట్టుకొని సరిహద్దులకు వచ్చేయండి అని రాయబార కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. విమానం టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. పైగా టికెట్లు దొరకడం లేదు. ఒక బంకర్లో తలదాచుకున్నాము. క్షిపణులు, రాకెట్ దాడులతో ఎంతో భయపడ్డాం. భోజనం లేదు. 5 రోజుల పాటు బ్రెడ్లు, బిస్కెట్లు తింటూ ఉన్నాం. తల్లిదండ్రులతో మాట్లాడాలంటే ఫోన్లు, ఇంటర్నెట్ పనిచేయలేదు. కీవ్, ఖార్కివ్‌లలో మరింత కష్టంగా ఉంది. ఇంకా ఎంతోమంది అక్కడ ఉండిపోయారు. ప్రభుత్వం వారిని రప్పించాలని అని తెలిపింది.
ఇప్పటికి 149 మంది రాక..
బనశంకరి: యుద్ధ బాధిత ఉక్రెయిన్‌లో 693 మంది కన్నడిగులు చిక్కుకోగా ఇప్పటివరకు 149 మంది భారత్‌కు చేరుకున్నారని నోడల్ అదికారి మనోజ్‌రాజన్ తెలిపారు. గురువారం నగరంలో ఆయన మాట్లాడుతూ మరో 11 బ్యాచుల్లో 63 మంది కన్నడిగులు ఇండియాకు బయలుదేరారని, గురువారం సాయంత్రం బెంగళూరుకు చేరుకున్నారని చెప్పారు. శుక్రవారం మరో 16 విమానాల్లో విద్యార్థులు ఇండియాకు వస్తారన్నారు. ఖార్కివ్‌లో బాంబు దాడిలో మరణించిన కన్నడిగుడు నవీన్ మృతదేహం తీసుకువచ్చే విషయంపై మాట్లాడుతూ మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
సాగర విద్యార్థిని రాక..
శివమొగ్గ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన సాగర పట్టణానికి చెందిన వైద్య విద్యార్థిని మనీసా లోబో బుధవారం రాత్రి బెంగళూరుకు చేరుకుందని తల్లిదండ్రులు తెలిపారు. అలాగే కొప్పళకు చెందిన సంగమేష్ సొప్పిమఠ అనే విద్యార్థి తిరిగిరాగా హారతి పట్టి స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment