సాక్షి, బెంగళూరు: ఉక్రెయిన్‌లో ఆ దేశ సైనికులకు, రష్యా బలగాలకు మధ్య భీకరపోరు నడుస్తోంది. ఈ దాడుల్లో రెండు దేశాల సైనికులు, సామాన్య పౌరులు సైతం మృత్యువాత పడుతున్నారు. ఈ దాడుల్లో ఇటీవల కర్నాటకకు చెందిన నవీన్ శేఖరప్ప చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవీన్ కుటుంబ సభ్యులు అతడి డెడ్ బాడీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొడుకును కడసారి చూడాలని పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ నేపథ్యంలో కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. విమానంలో మృతదేహాన్ని తరలిస్తే ఎక్కువ చోటు ఆక్రమిస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. హుబ్లీ-ధార్వాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ మాట్లాడుతూ.. నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు పయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే, యుద్దం జరుగుతున్న ప్రాంతం నుంచి బతికున్న వారిని తీసుకువచ్చేందుకే పరిస్థితులు ఎంతో సవాల్‌తో కూడుకున్నాయని.. అలాంటిది చనిపోయిన వారిని తీసుకురావడం ఎంతో కష్టంతో కూడుకున్నదని వెల్లడించారు. ఈ క్రమంలోనే విమానంలో మృతదేహం ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దానికి బదులుగా ఆ ప్లేసులో 8-10 మంది కూర్చోవచ్చు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. నవీన్ డెడ్ బాడీని రెండు రోజుల్లో ఇంటికి తీసువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు నవీన్ తండ్రి జ్ఞానగౌడ్ తెలిపారు. తన కుమారుడి మృతదేహాన్నిఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా తాను ప్రధాని మోదీని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించినట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment