కొడుకు డాక్టర్‌గా వస్తాడని అనుకున్నారు.. కానీ.. | Karnataka: Indian Medical Student Dies In Ukraine Russia War | Sakshi
Sakshi News home page

కొడుకు డాక్టర్‌గా వస్తాడని అనుకున్నారు.. కానీ..

Published Thu, Mar 3 2022 7:17 PM | Last Updated on Thu, Mar 3 2022 7:31 PM

Karnataka: Indian Medical Student Dies In Ukraine Russia War - Sakshi

చళగేరిలో ఇంటి ముందు నవీన్‌ ఫొటోకు నివాళులు, దీనంగా నవీన్‌ తండ్రి

శివాజీనగర: తనయుడు డాక్టర్‌ అయి తిరిగి వస్తాడని అనుకుంటే విగతజీవిగా మారడంతో కుటుంబం తల్లిడిల్లిపోతోంది. కడసారి చూడాలని తపిస్తోంది. ఉక్రెయిన్‌లో క్షిపణి దాడిలో మరణించిన హావేరి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి నవీన్‌ గ్యానగౌడర్‌ (22) కుటుంబానికి వెల్లువలా పరామర్శించారు. బుధవారం రాణి బెన్నూరు తాలూకా చళగేరి గ్రామంలో ఉన్న నవీన్‌ ఇంట్లో విషాద మౌనం ఆవరించింది. కుమారుడిని కోల్పోయి దిక్కు తోచక తండ్రి శేఖరగౌడ కూర్చొన్నారు. బంధుమిత్రులు పెద్దసంఖ్యలో ఇంటికి చేరుకొన్నారు. ఇంటి ముందు నవీన్‌ ఫోటోను ఏర్పాటు చేయగా ప్రజలు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.  

ఇతర విద్యార్థులనైనా కాపాడండి: తండ్రి..  
తండ్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ, ప్రముఖులు తనతో మాట్లాడారని, తన కొడుకు ప్రాణాలతో రాలేదు, కనీసం ఇతర విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని తాను మోదీని వేడుకొన్నట్లు చెప్పారు. మరణానికి ముందు తన కుమారుడు ఫోన్లో మాట్లాడేవాడని బంకర్‌లో ఉండడం కష్టం, బయటికి వచ్చినా కష్టమని చెప్పాడని, యుద్ధం జరగదని, ధైర్యంగా ఉండాలని కాలేజీవారు భరోసా ఇచ్చారన్నారు. ఇక్కడి రాజకీయం, రిజర్వేషన్, విద్యా విధానాలు సరిగా లేక తమ కుమారుడు ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి వచ్చిందని విలపించారు. భోజనాలకు తన వద్ద డబ్బు లేదు. డబ్బు వేయాలని కోరాడు, అదే ఆఖరి మాటైందని స్నేహితుడు శ్రీకాంత్‌ ఓ టీవీ చానల్‌కు తెలిపారు.  

భౌతికకాయం తరలింపునకు చర్యలు: సీఎం..  
ప్రస్తుతం ఖార్కివ్‌ నగరంలో నవీన్‌ మృతదేహం ఉండగా, అక్కడ నుండి విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవీన్‌ కుటుంబానికి పరిహారం అందిస్తామని సీఎం బొమ్మై చెప్పారు. భౌతికకాయాన్ని తీసుకురావడం ప్రథమ కర్తవ్యమని అన్నారు. కాగా మిగిలిన కన్నడిగులను వేగంగా వెనక్కి రప్పిస్తామని చెప్పారు.  

నా సోదరుడు రావడం లేదు..  
సమాజానికి ఏదో ఒకటి చేయాలని తన తమ్ముడు కలలు కన్నాడని, అతని వెంట వెళ్లినవారంతా వెనుతిరిగి ప్రాణాలతో వస్తున్నారు. అయితే తన తమ్ముడు రావడం లేదని మృతుడు నవీన్‌ సోదరుడు హర్ష రోదించారు.  

పేదల కలలపై నీట్‌ పిడుగు: కుమార  
పేద, మధ్యతరగతి వర్గాల మెడిసిన్‌ కలను నీట్‌  భగ్నం చేస్తోందని, ఇదే విద్యార్థుల, తల్లిదండ్రుల పాలిట మరణశాసనమైనదని మాజీ సీఎం హెచ్‌.డీ.కుమారస్వామి ధ్వజమెత్తారు. ఉన్నత విద్యను సంపన్నులకు రిజర్వు చేసి పేదలకు వట్టి చేయి చూపుతున్నారని నవీన్‌ మరణాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై మండిపడ్డారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement