Ukraine Crisis: Indian Student Naveen Deceased In Kharkiv - Sakshi
Sakshi News home page

Ukraine: అలా వెళ్లి ఉండకపోతే.. నవీన్‌ సజీవంగా ఉండేవాడేమో!

Published Wed, Mar 2 2022 8:54 AM | Last Updated on Wed, Mar 2 2022 10:42 AM

Ukraine Crisis: Indian Student Naveen Deceased In Kharkiv Ukraine - Sakshi

Indian Student Dies In Russia Attack: ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడుల్లో ఉక్రెయిన్‌ సైన్యం​ మాత్రమే కాదు.. సాధారణ పౌరులూ ప్రాణాలు విడుస్తున్నారు. మంగళవారం రష్యా బలగాల దాడుల్లో భారతీయ విద్యార్థి నవీన్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాద వార్తతో మిగతా తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఆందోళన నెలకొంది.  


ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో ఉంటూ మెడిసిన్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు నవీన్‌ శేఖరప్ప. నవీన్‌ స్వస్థలం కర్ణాటకలోని హవేరి జిల్లా చలగేరి. అయితే మంగళవారం రష్యాబలగాల దాడుల్లో అతను  దుర్మరణం పాలయ్యాడు. ఇదిలా ఉంటే నవీన్‌ మృతిపై రెండు వేర్వేరు కథనాలు వినిపిస్తున్నాయి. 

బంకర్‌లో(సురక్షిత ప్రాంతం)లో తలదాచుకున్న నవీన్‌.. తినడానికి, తాగడానికి ఏం లేకపోవడంతో బయటకు వచ్చాడని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే  రష్యన్‌ బలగాల కాల్పుల్లో తూటాలకు నవీన్‌ బలైనట్లు అతని దగ్గరి బంధువు ఉజ్జనగౌడ చెప్తున్నారు. గ్రాసరీ స్టోర్‌ బయట క్యూలో నిల్చున్న నవీన్ శేఖరప్పను.. రష్యా సైనికులు కాల్చి చంపేశారని, ఆరోజు ఉదయం తాను నవీన్‌ను ఆఖరిసారిగా చూశానని ఉజ్జనగౌడ అంటున్నారు. 

అయితే గ్రాసరీ స్టోర్‌ బయట క్యూలో నిలబడి ఉండగా.. మిస్సైల్‌ దాడి జరిగిందని, ఈ దాడిలోనే నవీన్‌ మృతి చెందినట్లు ఖార్కివ్‌లోని స్టూడెంట్‌ కోఆర్డినేటర్‌ పూజా ప్రహరాజ్ చెప్తున్నారు. ఖార్వివ్‌లోని గవర్నర్ హౌస్‌ సమీపంలో ఉంటున్న నవీన్‌.. ఆహారం కోసం ఓ స్టోర్‌ బయట క్యూలో నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా గవర్నర్ హౌస్‌ను రష్యా బలగాలు బాంబులతో పేల్చివేశాయని, దీంతో సమీపంలో ఉన్న నవీన్‌ మృతి చెందినట్లు పూజా ప్రహరాజ్‌ ఫోన్‌ ద్వారా తెలియజేశారు.  

సామాగ్రి కోసం నవీన్‌ ఒక్కడే బయటకు వెళ్లాడు. హాస్టల్‌లో ఉంటున్న అందరికీ మేమే వసతులు కల్పించాం. కానీ, నవీన్‌ మాత్రం గవర్నర్‌ హౌజ్‌ను ఆనుకుని ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. అందుకే సకాలంలో అందించలేకపోయాం. కాసేపు ఆగి ఉంటే అతనికి ఆహారం అందించి ఉండేదే. అయితే బయటకు వెళ్లిన చాలాసేపటికి నవీన్‌ తిరిగి రాకపోవడంతో అతని ఫోన్‌ను కాల్‌ చేశామని, ఒక ఉక్రేనియన్ మహిళ నవీన్‌ ఫోన్‌ లిఫ్ట్‌చేసి  ‘ఈ ఫోన్‌కు సంబంధించిన వ్యక్తి మృతి చెందాడు’ అని తెలిపినట్లు పూజా ప్రహరాజ్‌ వెల్లడించారు. నవీవ్‌ కాల్పులు జరపడం వల్ల మృతి చెందాడా? లేదా మిస్సైల్‌ దాడిలో మరణించడా? అనే దానిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ.. అతనికి ఆహారం అంది ఉన్నా..  నవీన్‌ ఒంటరిగా అలా బయటకు వెళ్లి ఉండకపోయినా సజీవంగా ఉండేవాడేమోనని అధికారులు అంటున్నారు. 

తండ్రి చివరి సలహ
ఇదిలా ఉంటే.. ఉ‍క్రెయిన్‌ ఉద్రిక్తతల సమయం నుంచి కుటుంబంతో రోజూ నవీన్‌ ఫోన్లో మా​‍ట్లాడుతూనే వస్తున్నాడు. యుద్ధం మొదలయ్యాక.. కంగారుపడ్డ అతని కుటుంబ సభ్యులు ఎలాగైనా అక్కడి నుంచి బయటపడమని నవీన్‌తో చెప్పారు. అయితే పరిస్థితులు అనుకూలంగా లేవని నవీన్‌ వాళ్లతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో భారతీయ జెండాను బిల్డింగ్‌పై ఉంచమని నవీన్‌ తండ్రి సూచించాడట.  

మృతదేహం అప్పగింతపై!
ఇక నవీన్‌ మృతదేహం అప్పగింతపై నీలినీడలు అలుముకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నవీన్‌ భౌతిక కాయాన్ని తరలించడం కష్టమని ఉక్రెయిన్‌ అధికారులు.. భారత రాయబార అధికారులతో చెప్పినట్లు సమాచారం. మరోవైపు నవీన్‌ మృతదేహాన్ని ఎలాగైనా కుటుంబ సభ్యులకు అప్పగించాలని కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

చదవండి: రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement