భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో కుట్రకోణం? | Conspiracy Theory In Bagmati Express Train Accident | Sakshi
Sakshi News home page

భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో కుట్రకోణం?

Published Fri, Oct 18 2024 4:05 PM | Last Updated on Fri, Oct 18 2024 4:08 PM

Conspiracy Theory In Bagmati Express Train Accident

చెన్నై: భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం వెనక కుట్రకోణం ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఎన్‌ఐఏ, రైల్వే అధికారులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైలు ప్రమాదానికి రైల్వే ఉద్యోగులేనన్న అనుమానాలు వస్తున్నాయి.

విచారణలో ప్రమాద ప్రాంతంలో స్విచ్‌ పాయింట్ల బోల్టులు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. లూప్‌ లైన్‌లో పట్టాలు ట్రాక్‌గా మారే చోట బోల్ట్‌నట్‌ విప్పడంతో గూడ్స్‌ ట్రాక్‌ మారింది. దీంతో గూడ్స్‌ ట్రైన్‌ను భాగమతి ఎక్స్‌ ప్రెస్‌ ఢీకొట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

20 మందికి పైగా రైల్వే సిబ్బంది, అధికారులను సౌత్‌జోన్‌ రైల్వే సేఫ్టీ కమిషనర్‌ చౌదరి ప్రశ్నించారు. బోల్ట్‌ విప్పింది బయటి వ్యక్తులు కాదని, రైల్వే ఉద్యోగులేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతుంది. దాని వెనుక కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

కాగా, గత శుక్రవారం (అక్టోబర​ 11)న రాత్రి 8.27 సమయంలో తమిళనాడులో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578) రైలు పొన్నేరి స్టేషన్‌ దాటింది. తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. 

కవరైపెట్టై స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైనుపై నుంచి కాకుండా లూప్‌లైన్‌లోకి వెళ్లడం, ఆ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి.ఈ ప్రమాదంలో 13 వరకు కోచ్‌లు పట్టాలు తప్పాయి. పార్సిల్‌ వ్యానులో మంటలు చెలరేగాయి. రైలు ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు,ఎన్‌ఐఏ అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా జరిగిన విచారణలో భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై కుట్రకోణం ఉందని సమాచారం. దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement