ముంబై : కరోనా కట్టడికి ఉపయోగించే శానిటైజర్లు వ్యాపారుల అక్రమ దందాకు అడ్డాగా మారాయి. నకిలీ శానిటైజర్ల విక్రయంతో తయారీదారులు, విక్రేతలు సొమ్ము చేసుకుంటున్నారు. 120 శానిటైజర్ శాంపిళ్లను తాము పరీక్షించగా వాటిలో 50 శాతం శానిటైజర్లు కల్తీవని తేలాయని కన్జూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీజీఎస్‌ఐ) వెల్లడించింది. 4 శాతం శానిటైజర్లలో హానికారక మిథైల్ ఆల్కహాల్ కలిసిఉన్నట్టు గుర్తించారు. దీర్ఘకాలం మిథైల్ ఆల్కహాల్‌ను వాడితే దృష్టిలోపాలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ నివేదికను కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఆహార ఔషధ నియంత్రణ మండలి (ఎఫ్‌డీఏ)కి పంపామని సీజీఎస్‌ఐ తెలిపింది.
కరోనా వైరస్ కట్టడిలో చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం అనివార్యం కావడంతో ఈ వ్యాపారంలో సత్వరమే డబ్బు సంపాదించేందుకు పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని సీజీఎస్‌ఐ కార్యదర్శి డాక్టర్ ఎంఎస్ కామత్ పేర్కొన్నారు. సబ్బు, నీరు అందుబాటులో లేకుంటే కనీసం 60 శాతం ఆల్కహాల్ కలిగిన శానిటైజర్‌ను వాడాలని డాక్టర్ కామత్ సూచించారు. ఇథైల్ ఆల్కహాల్ స్ధానంలో మిథైల్ ఆల్కహాల్‌ను తయారీదారులు వాడటంతో సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సీజీఎస్‌ఐ పరీక్షించిన కొన్ని శాంపిళ్లలో 75 రూపాయల విలువైన 250 ఎంఎల్ శానిటైజర్‌లో ఆల్కహాల్ అసలు లేదని గుర్తించారు. మరోవైపు మార్కెట్‌లో లభించే 37 శాతం శానిటైజర్లపై తయారీ వివరాలు తెలిపే లేబుల్ లేదని వెల్లడైంది. చదవండి : లిక్విడ్ బదులు జెల్ శానిటైజర్లు విక్రయించాలి
Comments
Please login to add a commentAdd a comment