తిరువనంతపురంలో డాక్యుమెంటరీ ప్రదర్శన
తిరువనంతపురం/వాషింగ్టన్: ప్రధాని మోదీపై ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరిట బ్రిటిష్ వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శిస్తామని కేరళలోని వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విభాగాలు మంగళవారం వెల్లడించాయి. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం విజయన్ జోక్యం చేసుకోవాలని, వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకోవాలని డిమాండ్ చేసింది.
డాక్యుమెంటరీని ప్రదర్శించబోతున్నామంటూ సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్‌ఐ ఫేసుబుక్‌లో పేర్కొంది. అనంతరం సీపీఎం విద్యార్థి విభాగం ఎస్‌ఎఫ్‌ఐ, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అనుబంధ విభాగాలు ప్రకటించాయి. రాష్ట్రంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనకు ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని బీజేపీ కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్ కోరారు. మత కలహాలు సృష్టించడానికే ఈ డాక్యుమెంటరీని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.
డాక్యుమెంటరీ గురించి తెలియదు: అమెరికా
బీబీసీ డాక్యుమెంటరీ గురించి తమకేమీ తెలియదని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. అమెరికా, భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని పేర్కొంది. ఇరు దేశాల నడుమ బలమైన సంబంధ బాంధవ్యాలను తాము కోరుకుంటున్నామని వెల్లడించింది. ఇరు దేశాలు విలువలను కలిసి పంచుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని ఉద్ఘాటించింది. బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ గతవారం ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడారు. మోదీపై అసత్యాలు ప్రచారం చేయొద్దని హితవు పలికారు.
కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శన
డాక్యుమెంటరీని ఎస్‌ఎఫ్‌ఐతోపాటు పలు సంఘాలు మంగళవారం కేరళలో కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలను వ్యతిరేకిస్తూ బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి, నిరసన వ్యక్తం చేశారు. పాలక్కాడ్, ఎర్నాకుళం తదితర ప్రాంతాల్లో యువమోర్చా కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి, వారిని అడ్డుకున్నారు. కేవలం కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్‌ఐ మంగళవారం తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment