న్యూఢిల్లీ: మే 2న విడుదలయ్యే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సమయంలో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ఫలితాలు వచ్చేటప్పుడు గానీ.. ఆ తర్వాత గానీ.. విజేతలైన అభ్యర్థులు సంబరాలు చేసుకోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, పార్టీ సంబరాలేవీ నిర్వహించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఫలితాల అనంతరం గెలిచినవారు ఈసీ నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సమయంలోనూ అభ్యర్థి వెంట ఇద్దరు మించి ఉండకూడదని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
కాగా ఇటీవల తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంతోపాలు పుదుచ్చేరిలో ఎనిమిది దశల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ జరుగుతుండగా.. ఏప్రిల్ 29 ఈ ఎన్నికలు ముగుస్తాయి. వీటి కౌంటింగ్ 2న చేపట్టనున్నారు. మరోవైపు దేశంలో కొన్ని రోజులుగా నిత్యం 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 2 వేలకు మించి కరోనా రోగులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో కోవిడ్ కేసులు పెరిగి పోవడానికి ఎన్నికల కమిషన్‌యే కారణమని మద్రాస్ హైకోర్టు సోమవారం ఈసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికల సంఘం అధికారులపై హత్యా నేరం కింద కేసులు పెట్టాలని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల రోజు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఈ నెల 30 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే కౌంటింగ్‌ను నిలిపివేస్తామని హెచ్చరించింది. మద్రాస్ హైకోర్టు హెచ్చరించిన మరుసటి రోజే ఈసీ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదే విధంగా గత వారమే పశ్చిమ బెంగాల్‌లో అన్ని రోడ్‌షోలు, పాదయాత్రలు, ర్యాలీలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిషేధిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment