సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వైరస్ బారినపడిన నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యల నడుమ సమావేశాలను నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగానే సమావేశాలకు 72 గంటల ముందు ఎంపీలు అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా పరీక్షలకు హాజరైన ఎంపీలందరికీ కరోనా నెగటివ్‌గా తేలితే వారికి సర్టిఫికెట్ సైతం జారీచేయనున్నారు. ఆ పత్రం ఉన్న వారినే సభలోకి అనుమతిస్తామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇదివరకే స్పష్టం చేశారు. (ఎంపీలకు కరోనా పరీక్షలు)
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభవుతున్న నేపథ్యంలో ఇప్పటికే కరోనా పరీక్షల ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. శని, ఆదివారాల్లో ఎంపీలందరికీ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ టెస్టుల్లోనూ కొంతమంది ఎంపీలకు పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం అందుతోంది. దీంతో సమావేశాలకు హాజరైన ఎంపీల్లో కలవరం మొదలైంది. ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే సమావేశాల మధ్యలో ఎవరికైనా వైరస్‌సోకితే మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
మరోవైపు ఎంపీలతో పాటు, పార్లమెంటు ఆవరణలోనికి ప్రవేశించే వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు, మీడియా ప్రతినిధులు, లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్ సిబ్బంది అంతా సమావేశాల ప్రారంభానికి ముందే పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ కోరారు. కాగా వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 న ప్రారంభమై, అక్టోబర్ 1కి ముగియనున్నాయి. (ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతాం)
Comments
Please login to add a commentAdd a comment