న్యూఢిల్లీ: కొత్త వేవ్ సంకేతాలకు ఊతమిచ్చేలా.. భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మాస్క్ ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం తదితర కారణాలతో కేసులు పెరిగిపోతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. తాజాగా ఒక్కరోజు వ్యవధిలోనే 30 శాతం కేసులు పెరిగిపోగా.. నాలుగు నెలల తర్వాత దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.
కొద్దిరోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత వారం నుంచి రోజూ 10 వేలకుపైనే కొత్త కేసులు వస్తు న్నాయి. గురువారం 13,313 కేసులు.. కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం శుక్రవారం 17,336 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అంటే.. గత ఇరవై నాలుగు గంటల్లో ఇది 30 శాతం(4,294 కేసులు) మేర పెరిగింది.
గత ఇరవై నాలుగు గంటల్లో.. కరోనాతో 13 మంది చనిపోయారు. అలాగే పాజిటివిటీ రేటు కూడా దాదాపు 4 శాతంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తంగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 88,284కి చేరింది.
ఒక్క మహారాష్ట్రలోనే 5,218 కేసులు వచ్చాయి. కేరళలో 3,890, ఢిల్లీ 1,934 కేసులు, తమిళనాడు 1,063 కేసులు, హర్యానా(872) కేసులు వచ్చాయి. ఢిల్లీలో అంతకు ముందు రోజు 926 కేసులు రాగా, తాజాగా 1,934 కేసులతో రెట్టింపు కావడం గమనార్హం.
కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి.. వైరస్ మ్యూటేషన్ గురించి ఆరా తీశారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని పలు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
కరోనాతో ఇప్పటిదాకా దేశంలో 5,24,954 మరణాలు నమోదు అయ్యాయి. 4,27,49,056 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1,96,77,33,217 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment