ముంబై: సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్‌లు తమ వ్యాక్సిన్లను అందరికీ సమానంగా రూ. 150కే విక్రయించేలా ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాలను వేర్వేరు రేట్లకు విక్రయించడంపై న్యాయవాది ఫయాజ్ ఖాన్ ఈ పిల్‌లో సవాలు చేశారు. ప్రస్తుతం టీకా ఒక అత్యవసర వస్తువని, అందువల్ల దీని సరఫరా, నిర్వహణను ప్రైవేట్ రంగం చేతుల్లో ఉంచకూడదని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ కారణంగా సంభవిస్తున్న మరణాలతో ప్రజల్లో పెరుగుతున్న భయాన్ని ఈ ఫార్మా కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయని విమర్శించారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం కంపెనీలు ఉత్పత్తి చేసిన టీకాల్లో 50 శాతాన్ని కేంద్రానికి సరఫరా చేయాల్సిఉంటుంది. మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, లేదా ఓపెన్ మార్కెట్లో సదరు కంపెనీలు విక్రయించుకోవచ్చు. కానీ ఈ సంక్షోభ తరుణంలో ధరను ప్రభుత్వమే నియంత్రించాలని, కంపెనీల దోపిడికి అవకాశం ఇవ్వకూడదని పిల్‌లో కోరారు. రాష్ట్రాలు ఓపెన్ మార్కెట్లో టీకాలను కొనాలని కేంద్రం సూచించడాన్ని సవాలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం టీకా సరఫరా చేస్తుందని, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయకపోగా, ఓపెన్ మార్కెట్లో అధిక ధరకు కొనేలా ప్రేరేపిస్తోందని పిటీషనర్లు ఆరోపించారు.
అందువల్ల కోర్టు జోక్యం చేసుకొని కంపెనీలు సమాన రేట్లకు టీకాలిచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. సీరమ్ సంస్థ టీకాను కేంద్రానికి రూ. 150కి, రాష్ట్రాలకు రూ. 400, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 600కు విక్రయిస్తోందని తెలిపారు. భారత్ బయోటెక్ రాష్ట్రాలకు రూ. 600కు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 1200కు టీకాను అమ్ముతోందన్నారు. ఈ అసమానతలు నివారించేందుకు కేంద్రం ముందుకు రావాలని కోరారు. చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిల్ విచారణకు వచ్చే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment