‘ఫైజర్‌’ వ్యాక్సిన్‌ దిగుమతికి అన్ని ఏర్పాట్లు | Coronavirus: Covid Vaccine Ready To Take Off | Sakshi
Sakshi News home page

‘ఫైజర్‌’ వ్యాక్సిన్‌ దిగుమతికి అన్ని ఏర్పాట్లు

Published Wed, Dec 9 2020 3:34 PM | Last Updated on Wed, Dec 9 2020 8:26 PM

Coronavirus: Covid Vaccine Ready To Take Off - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారీని సమర్థంగా ఎదుర్కొనే ఫైజర్‌–బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌కు డిసెంబర్‌ 2వ తేదీన బ్రిటన్‌ ప్రభుత్వం అనుమతిచ్చింది. రెండోవారం నుంచి అక్కడి ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వడం కూడా మొదలయింది. ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్‌కు అనుమతిచ్చిన ఏకైక దేశం బ్రిటన్‌. ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు భారత్‌ కూడా సన్నహాలు చేస్తోంది. అందుకుతగ్గ ఏర్పాట్లను కూడా చేసుకుపోతోంది.

ఫైజర్‌ వ్యాక్సిన్‌ను మైనస్‌ 70 డిగ్రీస్‌ సెల్సియస్‌ వాతావరణంలో నిల్వ చేయాల్సి ఉండడంతో అందుకు తగిన విధంగా కార్గో విమానంలో, విమానాశ్రయంలో, అక్కడి నుంచి దేశంలోని నలుమూలలకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు తగిన శీతల కంటేనర్లను, వాటిలో వచ్చే ఫైజర్‌ వ్యాక్సిన్‌ డోసులను నిల్వచేసే శీతల ల్యాబ్‌ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాట్లు చకా చకా జరగిపోతున్నాయి. (చదవండి : ఆస్ట్రాజెనెకా సురక్షితం.. ప్రభావవంతం)



వ్యాక్సిన్‌ను మైనస్‌ 70 డిగ్రీస్‌ సెల్సియస్  వాతావరణంలో భద్రపర్చడమంటే అంటార్కిటికలో శీతాకాలంలో ఉండే ఉష్ణోగ్రతకన్నా తక్కువలో భద్రపర్చడం. వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకొని భద్రపర్చడంతోపాటు, దాన్ని దేశం నలుమూలలకు రవాణా చేయడంతో ఈ శివాజీ విమానాశ్రయం కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే 30 వేల టన్నుల మందులను నిల్వచేసే శీతల గిడ్డంగులు కలిగి ఉండడం వల్లనే శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రం ఎంపిక చేసింది. సంవత్సరానికి మూడున్నర లక్షల టన్నుల మందులను హాండిల్‌ చేయగల సామర్థ్యం కలిగిన ‘ఎక్స్‌పోర్ట్‌ ఫార్మా ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌’ నాలుగువేల చదరపు మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. మొత్తం ఆసియాలోనే అతిపెద్ద అతిశీతల కేంద్రం ఇదే. రెండు డిగ్రీల నుంచి ఎనిమిది డిగ్రీల లోపు ఉష్ణోగ్రత కలిగిన ‘కూల్‌టేనర్లు’ కూడా ఈ శీతల గిడ్డంగికి ఉన్నాయి. అవి కార్గో విమానంలో వచ్చే మందులను ఈ కూల్‌టేనర్లు శీతల గిడ్డంగికి తీసుకొస్తాయి. 



ప్రస్తుతం ఈ అతిశీతల గిడ్డంగిలో ఉన్న అన్ని ఔషధాలను వాటి గమ్యస్థానాలకు పంపించి, కోవిడ్‌ వ్యాక్సిన్లను భద్రపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై త్వరలోనే ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విమానాశ్రయం అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీదారులు, వాటి రవాణాదారులు, ప్రభుత్వ మందుల నియంత్రణా యంత్రాంగం ప్రతినిధులు, దేశంలోని ఇతర విమానాశ్రయాల ప్రతినిధులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ అధికార ప్రతినిధి వివరించారు. కార్గో విమానాల్లో శీతల కంటేనర్ల ద్వారా వ్యాక్సిన్‌ డోస్‌లను తీసుకరావడం, వాటిని నేరుగా విమానాశ్రయంలోని అతిశీతల గిడ్డంగికి తరలించడం, అక్కడి నుంచి దేశంలోని నిర్దేశిత శీతల ల్యాబ్‌లు లేదా గిడ్డంగులకు తరలించడం, అక్కడి నుంచి వాటిని వైద్య సిబ్బందికి, వినియోగదారులకు చేరవేయడంలో ఎక్కడా ఆటంకాలు ఎదురుకాకుండా ఈ టాస్క్‌ఫోర్స్‌ చూసుకుంటుంది. ఒక్క వ్యాక్యంలో చెప్పాలంటే ఎక్కడా శీతోష్ణస్థితిలో మార్పులు రాకుండా చూసుకోవడంతోపాటు వ్యాక్సిన్‌ డోస్‌లను తయారుచేసే కంపెనీల నుంచి వాటిని వినియోగదారులకు చేరేవేసే వరకు అన్ని బాధ్యతలను ఈ టాస్క్‌ఫోర్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. 



టాస్క్‌ఫోర్స్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు విమానాశ్రయ అధికారులు కూడా ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందజేసేందుకు 24 గంటలు పనిచేసే ‘కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌’ను కూడా అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement