సాక్షి, హైదరాబాద్: సమయం లేదు మిత్రమా.. శరణమా... రణమా? తేల్చుకోవాల్సిన తరుణమిదే!! ఊహూ.. కొన్నేళ్ల క్రితం నాటి సినిమా డైలాగ్ ఏమాత్రం కాదిది. కోవిడ్‌పై పోరులో అత్యంత కీలకమైన వ్యాక్సిన్ల విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం ఇదని చెప్పే ప్రయత్నం మాత్రమే. రెండో దశ కరోనా శాంతిస్తున్న ఈ తరుణంలో ఇంకో దఫా ఆ మహమ్మారి విరుచుకుపడేలోపు అందరినీ వ్యాక్సిన్ రక్షణ ఛత్రంలోకి తీసుకురావాల్సిందే. కానీ.. భారత్ ఆ పని చేయగలదా? ప్రభుత్వం లక్ష్యించినట్టుగా ఈ ఏడాది చివరికల్లా అరు ్హలైన వారందరికీ వ్యాక్సిన్లు అందివ్వగలమా? అసలు సమస్య ఎక్కడుంది? పరిష్కారానికి జరుగుతున్న ప్రయత్నాలేమిటి?
కరోనా మహమ్మారి మానవాళిని కబళించడం మొదలై 18 నెలలు దాటింది. అనూహ్యమైన ఈ విపత్తును ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు అతితక్కువ కాలంలోనే వ్యాక్సిన్ అస్త్రాన్ని సిద్ధం చేశారు కూడా. కానీ.. ఈ ఏడాది జనవరిలో మొదలైన టీకా కార్యక్రమం ఐదు నెలలు గడుస్తున్నా నత్తనడకనే సాగుతోంది. డాక్టర్ వి.కె.పాల్ నేతృత్వంలోని కమిటీ 2021 జూలై నాటికల్లా 30 కోట్ల మందికి టీకాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు, యాభై ఏళ్ల పైబడ్డవారు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు ఇందులో ఉన్నారు. కానీ.. జూన్ ఐదవ తేదీ నాటికి ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఈ వర్గాల వారిలో కేవలం 19.5 కోట్ల మందికి మాత్రమే టీకాలందాయి. ఉత్పత్తి సమస్యలు ఒకవైపు.. విధానపరమైన లోపాలు ఇంకోవైపు చుట్టుముట్టి లక్ష్య సాధన ఇంకాస్త దూరం అనేలా చేస్తున్నాయి.
జనవరి పదహారో తేదీన దేశంలో టీకా కార్యక్రమం మొదలు కాగా.. ముందుగా ఊహించినట్లు తొలినాళ్లలో కొంత స్తబ్ధత ఏర్పడింది. టీకా వేసుకుంటే ఏమవుతుందో? అన్న ఆందోళన, చూద్దాం ఏమవుతుందో అన్న నిరాసక్తత దీనికి కారణమయ్యాయి. అయితే మార్చి రెండవ వారానికి దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ ఎక్కువవడం మొదలు కావడంతో టీకా కార్యక్రమానికి కొంత ఊపు వచ్చింది. దీంతో ఏప్రిల్ నెలలో ఒకట్రెండు రోజులపాటు 36 లక్షల టీకాలు ఇవ్వడం సాధ్యమైంది. కానీ.. ఆ తరువాత ఇది గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో ఇది 34 శాతం వరకూ పడిపోయింది. ఏప్రిల్‌లో సగటున రోజుకు 28.5 లక్షల మందికి టీకాలివ్వగా మే నెలలో ఇది 18.7 లక్షలకు పడిపోయింది. ఆగస్టు నుంచి మొదలై డిసెంబర్ నాటికి 216 కోట్ల టీకాలు అందుబాటులోకి వస్తాయని, వాటితో లక్ష్యాన్ని సాధిస్తామని ప్రభుత్వం చెబుతున్నా పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
ఆరు రెట్లు ఎక్కువైతేనే...
ఈ ఏడాది డిసెంబర్‌కల్లా దేశంలో అర్హులైన వారందరికీ రక్షణ కల్పించాలంటే.. టీకా కార్యక్రమం వేగం ఆరు రెట్లు పెరగాలి అని నిపుణులు చెబుతున్నారు. మే నెలలో కేవలం 5.8 కోట్ల మందికి టీకాలివ్వడం సాధ్యమైందని, జూన్ నుంచి నెలకు 36 కోట్ల మందికి టీకాలిస్తేనే డిసెంబర్‌కల్లా అర్హులైన అందరికీ రెండు డోసుల టీకాలివ్వడం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ 23 కోట్ల మందికి టీకాలిచ్చినా.. ఇందులో రెండు డోసులు పూర్తి చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువన్నది తెలిసిందే. ఆగస్టు – డిసెంబరు మధ్యకాలంలో 216 కోట్ల డోసులు సేకరించగలమన్న ప్రభుత్వ ప్రకటన కూడా ఆచరణలో అసాధ్యంగానే కనిపిస్తోంది. భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు కోవాగ్జిన్ తయారీ టెక్నాలజీని ఇతర కంపెనీలకు అప్పగించినా ఈ అంకెను చేరుకోవడం కష్టమే.
ఈ రెండు కంపెనీలు కాకుండా.. కేంద్రం బయలాజికల్ ఈ నుంచి కార్డివాక్స్ టీకాలు 30 కోట్లు సేకరిస్తామని ప్రకటించగా.. ఈ టీకా ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉండటం గమనార్హం. అలాగే జైడస్ క్యాడిల్లా కంపెనీ నుంచి 50 లక్షల టీకాలు సేకరించాలి. కానీ ఈ జై–కోవ్‌డీ టీకాకు అనుమతులు ఇంకా లభించాల్సి ఉంది. ఫైజర్ ఈ ఏడాది చివరికల్లా 5 కోట్ల డోసులు మాత్రమే ఇవ్వగలమని చెప్పింది. వచ్చే ఏడాది మొదట్లోనే తాము భారత్‌కు టీకాలు సరఫరా చేయగలమని మోడెర్నా స్పష్టం చేసింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేయనున్న నోవావ్యాక్స్, రష్యా తయారీ స్పుత్నిక్‌లను పరిగణలోకి తీసుకున్నా ఏడాది చివరికల్లా అవసరమైనన్ని టీకాలు ఉత్పత్తి కావడం కష్టసాధ్యమే. ప్రభుత్వ అంచనాల ప్రకారం జూన్‌లో టీకాల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతున్నా అది రోజుకు 40 లక్షల వరకూ మాత్రమే ఉండటం గమనార్హం.
4 రెట్ల వేగంతో 70 శాతం
అర్హులైన వారిలో 70% మందికి డిసెంబర్‌లోగా రెండు డోసుల టీకాలు ఇవ్వాలన్నా టీకా కార్యక్రమం వేగం కనీసం నాలుగు రెట్లు ఎక్కువ కావాలి. ఎక్కువ జనాభా ఉన్న యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ వేగంతో టీకాలిస్తేనే సాధ్యం. యూపీలో ప్రస్తుతం రోజుకు లక్షన్నర టీకాలు ఇస్తున్నారు. రోజుకు 14 లక్షల టీకాలు ఇస్తేగానీ లక్ష్యాన్ని చేరుకోలేము. తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో 18 ఏళ్ల పైబడ్డ వారు ఎక్కువగా ఉన్న విషయం ప్రస్తావనార్హం. దేశం మొత్తానికి సంబంధించి ఒక సమగ్రమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళిక లేని నేపథ్యంలో టీకా కార్యక్రమం ఆలస్యమవుతోందనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment