సాక్షి, న్యూఢిల్లీ: జీవితంలో చేసుకున్న పాపాలు పోవాలంటే గంగా స్నానం చేయాల్సిందేనని పూర్వీకుల నుంచి నానుడిలో ఉన్న మాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో గంగా స్నానం చేయడం వల్ల మనం చేసుకున్న పాపాలు పోవడం సరికదా, ఇప్పటివరకు లేని కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గంగానది తీరం పొడవునా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చి నదిలో కలుస్తున్న రసాయనాలకు తోడు, పుణ్యం కోసం స్నానాలు చేసే యాత్రికులు పడేసే చెత్తతో ఇప్పటికే కలుషితమైంది. ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు గంగా ప్రక్షాళనకు ఖర్చు చేస్తున్నప్పటికీ, పరిస్థితిలో మార్పు ఏమాత్రం కనిపించ ట్లేదు. గతేడాది కరోనా కారణంగా లాక్‌డౌన్ సమయంలో కాలుష్యం జాడలేని గంగానదిలో మళ్ల పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన కాలుష్యం పరిస్థితిని దయనీయంగా మార్చేసింది.
కాలుష్య కాసారంగా మారిన గంగానదిలో స్నానం చేయడం హానికరమని తాజాగా ఐఐటీఆర్ చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో గంగానదిలో పెద్ద ఎత్తున శవాలు కొట్టుకురావడం, నదీ పరివాహక ప్రాంతాల్లో శవాలు కనిపించడంతో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ళు, ఐఐటిఆర్ లక్నో సంస్థలకు గంగా నీటిపై దర్యాప్తు చేసే బాధ్యతను నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అప్పగించింది. మొదటి దశలో మే 24 నుంచి జూన్ 6 వరకు నమూనాలను తీసుకున్నారు. రెండో దశ జూన్ 10 నుంచి జూన్ 21 మధ్య పూర్తయింది. ఆ తరువాత పూర్తిస్థాయిగా పరిశీలించిన అనంతరం తుది నివేదికను సిద్ధం చేశారు.
గంగా స్నానం హానికరం..!
ఈ పరిశోధనలో, గంగానది నీటిలో బీఓడీ అనగా జీవరసాయన ఆక్సిజన్ డిమాండ్ ప్రమాణం కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఒక లీటరు శుభ్రమైన నది నీటిలో బీఓడీ స్థాయి 3 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉండాలి. కానీ గంగానది ప్రవాహంలోని చాలా చోట్ల లీటరు నీటిలో బీఓడీ 20–25 మి.గ్రా. వరకు ఉందని పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం దీనివల్ల జలచరాలకు ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. జీవ రసాయన ఆక్సిజన్ డిమాండ్ ప్రమా ణాల కంటే ఎక్కువగా ఉన్ననీటిలో స్నానం చేయ డం హానికరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
హానికరమైన బ్యాక్టీరియా గుర్తింపు
ఈ అధ్యయనంలో ఉత్తరప్రదేశ్ నుంచి బిహార్ వరకు గంగానది నీటిలో కరోనా లేదని తేలింది. ఈ రెండు రాష్ట్రాల్లోని 13 నగరాల నుంచి తీసుకున్న మొత్తం 67 నమూనాల ఆర్టీ–పీసీఆర్ రిపోర్ట్‌లు నెగెటివ్‌గా వచ్చాయి. గంగానది నీటిలో మాత్రం హానికరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ప్రతి నమూనా లో ఈ–కోలి బ్యాక్టీరియాను కనుగొన్నారు. అంతేగాక నీటిలో ఆక్సిజన్ కొరత ఉందని నిర్ధారించారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో గంగానది నుంచి 12 ప్రదేశాలలో, యమునా నది నుంచి ఒక ప్రదేశంలో నమూనాలను తీసుకు న్నట్లు లక్నో ఐఐటీఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్‌కే బారిక్ తెలిపారు. ఐఐటీఆర్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎ.బి. పంత్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ప్రీతి చతుర్వేది నాయకత్వంలోని బృందం గంగా నీటిపై అధ్యయనం చేసింది.
కరోనా ఆనవాళ్ల కోసం చేసిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన తర్వాత కూడా గంగా నీటిలో కాలుష్య జాడను కనుక్కొన్నేందుకు వివిధ పారామితులను విశ్లేషించారు. అందులో కొన్ని భౌతిక రసాయన పారామితులు నిర్ధారిత ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. భౌతిక రసాయన పారామితులలో పీహెచ్, కలర్, డిజాల్వ్‌డ్ ఆక్సిజన్ (డీఓ), బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), నైట్రేట్, క్లోరైడ్, అమ్మోనియం నైట్రోజన్, భాస్వరంల పారామితులను ప్రమాణాలకు తగ్గట్లుగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించారు.
ప్రతి నమూనాలోనూ ఈ–కోలి బ్యాక్టీరియా ఉనికి
శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తీసుకున్న 67 నమూనాలు అన్నింటింలోనూ ఈ–కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ బాక్టీరియా సాధారంగాణ మానవులు,జంతువుల కడుపులో ఎల్లప్పుడూ ఉంటుంది. దాని వేరియంట్స్ చాలావరకు హాని కలిగించవు. కానీ కొన్నిసార్లు కడుపులో మెలిపెట్టినట్లు కావడం, విరేచనాలు వంటి లక్షణాలకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా కొన్నిసార్లు ఈ–కోలి బ్యాక్టీరియా కారణంగా కొందరిలో మూత్రపిండాలు పనిచేయడం మానేసి రోగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.
గంగా నీటిలో ‘ఫీకల్ స్ట్రెప్టోకోకి’ ఆనవాళ్లు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావో, వారణాసి, ప్రయాగ్‌రాజ్, ఘాజిపూర్, కాన్పూర్ నగరాల్లో గంగానది నుంచి తీసుకున్న నమూనాలలో ఫీకల్ స్ట్రెప్టోకోకి బ్యాక్టీరియాను కనుగొన్నారు. అదే సమయంలో బిహార్‌లోని సారన్‌లో ఒకటి, భోజ్‌పూర్‌లో తీసుకున్న మూడు నమూనా ల్లోనూ ప్రమాదకరమైన రకం బ్యాక్టీరియా స్ట్రెప్టోకోకి ఉనికిని గుర్తించారు. ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ రావడానికి ఇది ప్రధాన కారణమని పరిశోధకులు తెలిపారు. ఇదిమాత్రమేగాక బ్యాక్టీరియా కడుపు, ప్రేగులకు సంబంధించిన అనేక ఇతర రుగ్మతలకు కూడా కారణమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment