harmful germs
-
గంగా జలాల్లో హానికర బ్యాక్టీరియా
సాక్షి, న్యూఢిల్లీ: జీవితంలో చేసుకున్న పాపాలు పోవాలంటే గంగా స్నానం చేయాల్సిందేనని పూర్వీకుల నుంచి నానుడిలో ఉన్న మాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో గంగా స్నానం చేయడం వల్ల మనం చేసుకున్న పాపాలు పోవడం సరికదా, ఇప్పటివరకు లేని కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గంగానది తీరం పొడవునా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చి నదిలో కలుస్తున్న రసాయనాలకు తోడు, పుణ్యం కోసం స్నానాలు చేసే యాత్రికులు పడేసే చెత్తతో ఇప్పటికే కలుషితమైంది. ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు గంగా ప్రక్షాళనకు ఖర్చు చేస్తున్నప్పటికీ, పరిస్థితిలో మార్పు ఏమాత్రం కనిపించ ట్లేదు. గతేడాది కరోనా కారణంగా లాక్డౌన్ సమయంలో కాలుష్యం జాడలేని గంగానదిలో మళ్ల పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన కాలుష్యం పరిస్థితిని దయనీయంగా మార్చేసింది. కాలుష్య కాసారంగా మారిన గంగానదిలో స్నానం చేయడం హానికరమని తాజాగా ఐఐటీఆర్ చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో గంగానదిలో పెద్ద ఎత్తున శవాలు కొట్టుకురావడం, నదీ పరివాహక ప్రాంతాల్లో శవాలు కనిపించడంతో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ళు, ఐఐటిఆర్ లక్నో సంస్థలకు గంగా నీటిపై దర్యాప్తు చేసే బాధ్యతను నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అప్పగించింది. మొదటి దశలో మే 24 నుంచి జూన్ 6 వరకు నమూనాలను తీసుకున్నారు. రెండో దశ జూన్ 10 నుంచి జూన్ 21 మధ్య పూర్తయింది. ఆ తరువాత పూర్తిస్థాయిగా పరిశీలించిన అనంతరం తుది నివేదికను సిద్ధం చేశారు. గంగా స్నానం హానికరం..! ఈ పరిశోధనలో, గంగానది నీటిలో బీఓడీ అనగా జీవరసాయన ఆక్సిజన్ డిమాండ్ ప్రమాణం కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఒక లీటరు శుభ్రమైన నది నీటిలో బీఓడీ స్థాయి 3 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉండాలి. కానీ గంగానది ప్రవాహంలోని చాలా చోట్ల లీటరు నీటిలో బీఓడీ 20–25 మి.గ్రా. వరకు ఉందని పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం దీనివల్ల జలచరాలకు ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. జీవ రసాయన ఆక్సిజన్ డిమాండ్ ప్రమా ణాల కంటే ఎక్కువగా ఉన్ననీటిలో స్నానం చేయ డం హానికరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హానికరమైన బ్యాక్టీరియా గుర్తింపు ఈ అధ్యయనంలో ఉత్తరప్రదేశ్ నుంచి బిహార్ వరకు గంగానది నీటిలో కరోనా లేదని తేలింది. ఈ రెండు రాష్ట్రాల్లోని 13 నగరాల నుంచి తీసుకున్న మొత్తం 67 నమూనాల ఆర్టీ–పీసీఆర్ రిపోర్ట్లు నెగెటివ్‌గా వచ్చాయి. గంగానది నీటిలో మాత్రం హానికరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ప్రతి నమూనా లో ఈ–కోలి బ్యాక్టీరియాను కనుగొన్నారు. అంతేగాక నీటిలో ఆక్సిజన్ కొరత ఉందని నిర్ధారించారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో గంగానది నుంచి 12 ప్రదేశాలలో, యమునా నది నుంచి ఒక ప్రదేశంలో నమూనాలను తీసుకు న్నట్లు లక్నో ఐఐటీఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్కే బారిక్ తెలిపారు. ఐఐటీఆర్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎ.బి. పంత్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ప్రీతి చతుర్వేది నాయకత్వంలోని బృందం గంగా నీటిపై అధ్యయనం చేసింది. కరోనా ఆనవాళ్ల కోసం చేసిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన తర్వాత కూడా గంగా నీటిలో కాలుష్య జాడను కనుక్కొన్నేందుకు వివిధ పారామితులను విశ్లేషించారు. అందులో కొన్ని భౌతిక రసాయన పారామితులు నిర్ధారిత ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. భౌతిక రసాయన పారామితులలో పీహెచ్, కలర్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ (డీఓ), బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), నైట్రేట్, క్లోరైడ్, అమ్మోనియం నైట్రోజన్, భాస్వరంల పారామితులను ప్రమాణాలకు తగ్గట్లుగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించారు. ప్రతి నమూనాలోనూ ఈ–కోలి బ్యాక్టీరియా ఉనికి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తీసుకున్న 67 నమూనాలు అన్నింటింలోనూ ఈ–కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ బాక్టీరియా సాధారంగాణ మానవులు,జంతువుల కడుపులో ఎల్లప్పుడూ ఉంటుంది. దాని వేరియంట్స్ చాలావరకు హాని కలిగించవు. కానీ కొన్నిసార్లు కడుపులో మెలిపెట్టినట్లు కావడం, విరేచనాలు వంటి లక్షణాలకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా కొన్నిసార్లు ఈ–కోలి బ్యాక్టీరియా కారణంగా కొందరిలో మూత్రపిండాలు పనిచేయడం మానేసి రోగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. గంగా నీటిలో ‘ఫీకల్ స్ట్రెప్టోకోకి’ ఆనవాళ్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావో, వారణాసి, ప్రయాగ్‌రాజ్, ఘాజిపూర్, కాన్పూర్ నగరాల్లో గంగానది నుంచి తీసుకున్న నమూనాలలో ఫీకల్ స్ట్రెప్టోకోకి బ్యాక్టీరియాను కనుగొన్నారు. అదే సమయంలో బిహార్‌లోని సారన్లో ఒకటి, భోజ్‌పూర్‌లో తీసుకున్న మూడు నమూనా ల్లోనూ ప్రమాదకరమైన రకం బ్యాక్టీరియా స్ట్రెప్టోకోకి ఉనికిని గుర్తించారు. ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ రావడానికి ఇది ప్రధాన కారణమని పరిశోధకులు తెలిపారు. ఇదిమాత్రమేగాక బ్యాక్టీరియా కడుపు, ప్రేగులకు సంబంధించిన అనేక ఇతర రుగ్మతలకు కూడా కారణమవుతుంది. -
ఈ చెరువుల్లో నీరు యమ డేంజర్, అస్సలు తాకొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోని చెరువుల్లో ప్రమాదకరమైన కొత్తరకం బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడ్డాయి. సిటీ వ్యాప్తంగా చెరువులు, కుంటల నుంచి నీటి శాంపిల్స్ తీసుకుని పరీక్షించామని.. ఇందులో చాలావరకు జలాశయాల్లో ‘మెటలో బీటా లాక్టమస్–1’అనే జన్యువు ఉన్న బ్యాక్టీరియాను గుర్తించామని హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు చెప్తున్నారు. గృహ, పారిశ్రామిక కాలుష్యమే ఈ తరహా బ్యాక్టీరియా పెరగడానికి కారణమని వారు అంటున్నారు. మురుగు వ్యర్థాలు, భార లోహాలు అధికంగా ఉన్న నీటిలోనే ఈ బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుందని, ఇది యాంటీ బయాటిక్స్‌కు సైతం లొంగని మొండిరకమని పరిశోధకులు తమ నివేదికలో తెలిపారు. ఆయా చెరువులు, కుంటల్లో నీటిని తాగినా, ఇతర ఏ అవసరాలకు వినియోగించినా కూడా.. డయేరియా, అంటు వ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల బారినపడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ బ్యాక్టీరియా భూగర్భజలాల్లో కలిసే అవకాశం లేదన్నారు. అయితే చెరువులు, కుంటల నుంచి వివిధ మార్గాల్లో చుట్టూ రెండు కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆయా జలాశయాల్లో నీటిని ఎట్టి పరిస్థితుల్లో తాకవద్దని పేర్కొన్నారు. కాలుష్యం కాటు.. బ్యాక్టీరియా వేటు ►గ్రేటర్ పరిధిలో సుమారు 185 చెరువులు ఉండగా.. వాటిలో సగం చెరువుల్లోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వ్యర్థ జలాలు వచ్చి కలుస్తున్నాయి. ►ఐఐటీ హైదరాబాద్ పరిశోధకుల బృందం సిటీలోని అంబర్‌పేట ఎస్టీపీ, దుర్గం చెరువు, అమీన్పూర్, అల్వాల్, హుస్సేన్‌సాగర్, మోమిన్‌పేట్, సరూర్‌నగర్, ఫాక్స్ సాగర్, కంది, మీరాలం, నాగోల్, ఉప్పల్ నల్లచెర్వు, సఫిల్‌గూడ చెరువుల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షించింది. ►ఈ చెరువులన్నింటి నీళ్లలో ‘న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్–1’జన్యువు కలిగిన కొత్త రకం బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించింది. ►మంజీరా, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తదితర మంచినీటి జలాశయాల్లో నమూనాలను కూడా పరీక్షించారు. వాటిలో ఈ బ్యాక్టీరియా ఉనికి బయటపడలేదు. ►కొన్నేళ్లుగా చెరువులు కబ్జాకు గురవడం, చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోనే భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు కూపాలుగా మారుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. చెరువుల ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యతమిస్తోందని, మురుగు చేరకుండా గట్టి చర్యలు తీసుకోవడంలో విఫలమౌతోందని ఆరోపిస్తున్నారు. ►రోజువారీగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వెలువడుతున్న 1,400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మేర మురుగునీరు నేరుగా మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. ఆ చెరువుల ప్రక్షాళనకు చర్యలివే.. ►గ్రేటర్ పరిధిలోని చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. అడుగున పేరుకున్న ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలి. ►జలాశయాల ఉపరితలంపై పెరిగిన గుర్రపు డెక్కను తొలగించాలి. ►చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ►గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థ జలాలు చేరకుండా చర్యలు తీసుకోవాలి. మురుగునీటిని ఎస్టీపీల్లో శుద్ధి చేశాకే.. నాలాల్లోకి వదలాలి. ఈ బ్యాక్టీరియాతో రోగాల ముప్పు తథ్యం సిటీలోని పలు చెరువులు, కుంటల్లో ‘న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్–1’బ్యాక్టీరియా బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ల తరహాలో ఈ బ్యాక్టీరియా సుదూర ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేదు. సమీపంలో సుమారు 2 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించే అవకాశముంది. ఆయా చెరువుల నీటిని తాకినా, బట్టలు ఉతికినా, అందులోని చేపలు పట్టుకొని తిన్నా, అధిక సమయం ఈ చెరువుల పరిసరాల్లో గడిపినా ఈ బ్యాక్టీరియా మనుషుల్లో ప్రవేశించి శ్వాసకోశ వ్యాధులు, డయేరియా, చర్మ వ్యాధులు, అంటురోగాలకు కారణమౌతుంది. ఈ బ్యాక్టీరియా భూగర్భ జలాల్లో చేరే అవకాశం లేదు. – ప్రొఫెసర్ శశిధర్, ఐఐటీ హైదరాబాద్ తాగునీటి నాణ్యతకు ఢోకా లేదు మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, గోదావరి (ఎల్లంపల్లి), కృష్ణా మూడుదశల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్న నీటిని 3 దశ ల్లో శుద్ధి చేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు క్లోరినేషన్, బూస్టర్ క్లోరినేషన్ నిర్వహణతో ఇక్కడి తాగునీటి నాణ్యతపై జలమండలికి ఐఎస్వో ధ్రువీకరణ లభించింది. నగరవ్యాప్తంగా సరఫరా చేస్తు న్న తాగునీటికి సంబంధించి ఐదువేలకు పైగా నమూనాలను పరీక్షిస్తున్నాం. ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించలేదు. తాగునీటి నాణ్యతపై అనుమానాలు, అపోహలకు తావులేదు. – జలమండలి ఎండీ దానకిశోర్ యాంటీ బయాటిక్స్‌కు లొంగదు! ‘న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్–1’జన్యువు ఉన్న బ్యాక్టీరియా చాలా మొండిదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ బ్యాక్టీరియాతో చర్మ, శ్వాసకోశ వ్యాధులు వచ్చిన వారికి సాధారణంగా వైద్యులు ఇచ్చే యాంటీ బయాటిక్స్ పనిచేయవని చెప్తున్నారు. కలుషిత జలాలు చేరిన చెరువుల నీటిని తాకడం, బట్టలు ఉతకడం, స్నానం చేయడం, ఆ జలాశయాల్లోని చేపలను తినడం, ఈ నీటిని ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల బ్యాక్టీరియా సోకుతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం ఆయా జలాశయాల వద్ద గడపవద్దని కూడా సూచిస్తున్నారు. మురుగు నీరు చేరికతోనే.. సిటీ పరిధిలోని చెరువుల్లోకి గృహ, పారిశ్రామిక వ్యర్థాలు చేర డంతో కాలుష్యం బారినపడుతున్నాయి. నీటిలోని భార లోహా లు, రసాయనాలతో చెరువుల్లో కొత్తరకం బ్యాక్టీరియా వృద్ధి చెందుతోంది. జలాశయాలను ప్రక్షాళన చేయడంలో బల్దియా విఫలమవుతోంది. – సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణవేత్త -
పెప్సీ, కోకోకోలా పానీయాలు బాయ్‌కాట్!
చెన్నై: బహుళజాతి సంస్థలు తయారు చేసిన శీతల పానీయాలపై తమిళనాడులో బహిష్కరణ వేటు పడింది. రాష్ట్రవ్యాప్తంగా పెప్సీ, కోకోకోలా శీతల పానీయాల అమ్మకాలు బుధవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. స్థానిక శీతల పానీయాలనే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రెండు కూల్ డ్రింక్స్‌ను బహిష్కరిస్తూ తమిళనాడు వనిగర్ సంఘం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నిర్ణయానికి సానుకూల స్పందన వస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు ఏఎం విక్రమరాజా తెలిపారు. పానీయాల ప్రభావం గురించి వ్యాపారులకు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. పెప్సీ, కోక్ పానీయాలు ఆరోగ్యానికి హానికరమని, వాటిలో క్రిమిసంహారకాలు ఉన్నాయన్నారు. అందువల్లే దేశీయం ఉత్పత్తి చేసే పానీయాలను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామని విక్రమరాజా పేర్కొన్నారు. కాలీ మార్క్, బొవాంటో, టోనిరో వంటి స్థానిక పానీయాలు అమ్మకాలు పెంచేలా చర్యలు చేపడతామన్నారు. దీంతో కోక్.. పెప్సీ అమ్మకాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో రూ.1,400 కోట్లు నష్టం వాటిల్లినుంది. కాగా జల్లికట్టు విషయంలో తమ సంప్రదాయాల్ని.. సంస్కృతిని దెబ్బ తీసేలా వ్యవహరించిన పెటాకు ఆర్థిక సాయం అందించే పెప్సీ.. కోకోకోలా ఉత్పత్తుల్ని సినిమా థియేటర్లలో అమ్మకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
పెప్సీ, కోకోకోలా పానీయాలు బాయ్‌కాట్!