ఈ చెరువుల్లో నీరు యమ డేంజర్‌, అస్సలు తాకొద్దు | Hyderabad: IIT scientists Identified Harmful Bacteria In City Ponds | Sakshi
Sakshi News home page

ఈ చెరువుల్లో నీరు యమ డేంజర్‌, అస్సలు తాకొద్దు

Published Sun, Apr 11 2021 3:33 AM | Last Updated on Sun, Apr 11 2021 1:35 PM

Hyderabad: IIT scientists Identified Harmful Bacteria In City Ponds - Sakshi

సరూర్‌నగర్‌ చెరువు

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చెరువుల్లో ప్రమాదకరమైన కొత్తరకం బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడ్డాయి. సిటీ వ్యాప్తంగా చెరువులు, కుంటల నుంచి నీటి శాంపిల్స్‌ తీసుకుని పరీక్షించామని.. ఇందులో చాలావరకు జలాశయాల్లో ‘మెటలో బీటా లాక్టమస్‌–1’అనే జన్యువు ఉన్న బ్యాక్టీరియాను గుర్తించామని హైదరాబాద్‌ ఐఐటీ పరిశోధకులు చెప్తున్నారు. గృహ, పారిశ్రామిక కాలుష్యమే ఈ తరహా బ్యాక్టీరియా పెరగడానికి కారణమని వారు అంటున్నారు.

మురుగు వ్యర్థాలు, భార లోహాలు అధికంగా ఉన్న నీటిలోనే ఈ బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుందని, ఇది యాంటీ బయాటిక్స్‌కు సైతం లొంగని మొండిరకమని పరిశోధకులు తమ నివేదికలో తెలిపారు. ఆయా చెరువులు, కుంటల్లో నీటిని తాగినా, ఇతర ఏ అవసరాలకు వినియోగించినా కూడా.. డయేరియా, అంటు వ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల బారినపడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ బ్యాక్టీరియా భూగర్భజలాల్లో కలిసే అవకాశం లేదన్నారు. అయితే చెరువులు, కుంటల నుంచి వివిధ మార్గాల్లో చుట్టూ రెండు కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆయా జలాశయాల్లో నీటిని ఎట్టి పరిస్థితుల్లో తాకవద్దని పేర్కొన్నారు. 

కాలుష్యం కాటు.. బ్యాక్టీరియా వేటు 
గ్రేటర్‌ పరిధిలో సుమారు 185 చెరువులు ఉండగా.. వాటిలో సగం చెరువుల్లోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వ్యర్థ జలాలు వచ్చి కలుస్తున్నాయి. 
ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకుల బృందం సిటీలోని అంబర్‌పేట ఎస్టీపీ, దుర్గం చెరువు, అమీన్‌పూర్, అల్వాల్, హుస్సేన్‌సాగర్, మోమిన్‌పేట్, సరూర్‌నగర్, ఫాక్స్‌ సాగర్, కంది, మీరాలం, నాగోల్, ఉప్పల్‌ నల్లచెర్వు, సఫిల్‌గూడ చెరువుల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షించింది. 
ఈ చెరువులన్నింటి నీళ్లలో ‘న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్‌–1’జన్యువు కలిగిన కొత్త రకం బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించింది. 
మంజీరా, సింగూరు, ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్‌ తదితర మంచినీటి జలాశయాల్లో నమూనాలను కూడా పరీక్షించారు. వాటిలో ఈ బ్యాక్టీరియా ఉనికి బయటపడలేదు. 
కొన్నేళ్లుగా చెరువులు కబ్జాకు గురవడం, చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు కూపాలుగా మారుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. చెరువుల ప్రక్షాళనలో జీహెచ్‌ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యతమిస్తోందని, మురుగు చేరకుండా గట్టి చర్యలు తీసుకోవడంలో విఫలమౌతోందని ఆరోపిస్తున్నారు. 
రోజువారీగా గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా వెలువడుతున్న 1,400 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్‌ లీటర్ల మేర మురుగునీరు నేరుగా మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది.  

ఆ చెరువుల ప్రక్షాళనకు చర్యలివే.. 
►గ్రేటర్‌ పరిధిలోని చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. అడుగున పేరుకున్న ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించాలి. 
►జలాశయాల ఉపరితలంపై పెరిగిన గుర్రపు డెక్కను తొలగించాలి. 
►చెరువుల్లో ఆక్సిజన్‌ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్‌ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. 
►గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థ జలాలు చేరకుండా చర్యలు తీసుకోవాలి. మురుగునీటిని ఎస్టీపీల్లో శుద్ధి చేశాకే.. నాలాల్లోకి వదలాలి. 

ఈ బ్యాక్టీరియాతో రోగాల ముప్పు తథ్యం 
సిటీలోని పలు చెరువులు, కుంటల్లో ‘న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్‌–1’బ్యాక్టీరియా బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ల తరహాలో ఈ బ్యాక్టీరియా సుదూర ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేదు. సమీపంలో సుమారు 2 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించే అవకాశముంది. ఆయా చెరువుల నీటిని తాకినా, బట్టలు ఉతికినా, అందులోని చేపలు పట్టుకొని తిన్నా, అధిక సమయం ఈ చెరువుల పరిసరాల్లో గడిపినా ఈ బ్యాక్టీరియా మనుషుల్లో ప్రవేశించి శ్వాసకోశ వ్యాధులు, డయేరియా, చర్మ వ్యాధులు, అంటురోగాలకు కారణమౌతుంది. ఈ బ్యాక్టీరియా భూగర్భ జలాల్లో చేరే అవకాశం లేదు. 
– ప్రొఫెసర్‌ శశిధర్, ఐఐటీ హైదరాబాద్‌ 

తాగునీటి నాణ్యతకు ఢోకా లేదు 
మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, గోదావరి (ఎల్లంపల్లి), కృష్ణా మూడుదశల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్న నీటిని 3 దశ ల్లో శుద్ధి చేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు క్లోరినేషన్, బూస్టర్‌ క్లోరినేషన్‌ నిర్వహణతో ఇక్కడి తాగునీటి నాణ్యతపై జలమండలికి ఐఎస్‌వో ధ్రువీకరణ  లభించింది. నగరవ్యాప్తంగా సరఫరా చేస్తు న్న తాగునీటికి సంబంధించి ఐదువేలకు పైగా నమూనాలను పరీక్షిస్తున్నాం. ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించలేదు. తాగునీటి నాణ్యతపై అనుమానాలు, అపోహలకు తావులేదు.
– జలమండలి ఎండీ దానకిశోర్‌ 

యాంటీ బయాటిక్స్‌కు లొంగదు! 
‘న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్‌–1’జన్యువు ఉన్న బ్యాక్టీరియా చాలా మొండిదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ బ్యాక్టీరియాతో చర్మ, శ్వాసకోశ వ్యాధులు వచ్చిన వారికి సాధారణంగా వైద్యులు ఇచ్చే యాంటీ బయాటిక్స్‌ పనిచేయవని చెప్తున్నారు. కలుషిత జలాలు చేరిన చెరువుల నీటిని తాకడం, బట్టలు ఉతకడం, స్నానం చేయడం, ఆ జలాశయాల్లోని చేపలను తినడం, ఈ నీటిని ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల బ్యాక్టీరియా సోకుతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం ఆయా జలాశయాల వద్ద గడపవద్దని కూడా సూచిస్తున్నారు.

మురుగు నీరు చేరికతోనే.. 
సిటీ పరిధిలోని చెరువుల్లోకి గృహ, పారిశ్రామిక వ్యర్థాలు చేర డంతో కాలుష్యం బారినపడుతున్నాయి. నీటిలోని భార లోహా లు, రసాయనాలతో చెరువుల్లో కొత్తరకం బ్యాక్టీరియా వృద్ధి చెందుతోంది. జలాశయాలను ప్రక్షాళన చేయడంలో బల్దియా విఫలమవుతోంది. – సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణవేత్త  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement