ప్రతీకాత్మక చిత్రం
కరోనా సమయంలో రోడ్ల మీద కష్టాలు పడుతున్న భిక్షగాళ్లను ఆదుకునేందుకు సిద్ధమైన పోలీసులకు పెద్ద షాక్ తగిలింది. యాచకుల్లో ఒకరు.. సొంతంగా తనకున్న ఇళ్లను అద్దెకిచ్చి.. భిక్షాటన చేస్తున్నట్లు చెప్పగా, ఇంకొకరు తన వద్ద నోట్ల కట్టలున్నాయని చెప్పడంతో ఖాకీలు అవాక్కయ్యారు.
సాక్షి, చెన్నై : కరోనా కష్టాలు ఎవర్నీ వదలి పెట్ట లేదు. అన్ని వర్గాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోడ్ల మీద , బస్టాండ్‌లలో తలదాచుకుని భిక్షాటనలో ఉన్న వారు ఎదుర్కొంటున్న కష్టాల్ని పరిగణించి నాగర్ కోయిల్ పోలీసులు, కార్పొరేషన్ వర్గాలు సేవలకు సిద్ధం అయ్యారు. ఆ దిశగా మంగళవారం నుంచి నాగర్ కోయిల్‌లో ఉన్న భిక్షగాళ్లను ఆశ్రమానికి తరలించే పనిలో పడ్డారు.
వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇద్దరికి పాజిటివ్ రావడంతో కలవరం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయాన్నే బస్టాండ్ ఆవరణలో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, దివ్యాంగులు స్థానిక పోలీసుల వద్దకే వెళ్లి అన్నం పొట్లాలు ఇప్పించాలని వేడుకున్నారు. దీంతో వీరందర్నీ పోలీసులు విచారించి కొంతకాలం ఆశ్రమానికి తరలించాలని నిర్ణయించారు. ఈక్రమంలో వారికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి.
ఆటోలో వచ్చి మరీ..
ఈ సమయంలో నలుగురు భిక్షగాళ్లు అక్కడి నుంచి జారుకునే యత్నం చేశారు. దీనిని గుర్తించిన పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది మందలించారు. ఈసమయంలో ఓ భిక్షగాడు అయితే, తాను ఆశ్రమానికి వెళ్లే ప్రసక్తే లేదని, తనకు సొంతంగా ఇళ్లు ఉన్నాయని, వాటిలో కొన్నింటిని అద్దెకు కూడా ఇచ్చి ఉన్నట్టు వెల్లడించారు. విచారణ చేపట్టిన పోలీసులు సొంతిళ్లను అద్దెకు ఇచ్చిన భిక్షగాడు నగర శివారు వరకు రోజు ఆటోలో వచ్చి, భిక్షాటన అనంతరం తిరిగి వెళ్లే వాడు అని తేలింది. దీంతో అతడ్ని తీవ్రంగా మందలించారు. మరోమారు చిక్కితే కటకటాల్లోకి నెడుతామని హెచ్చరించారు.
మరో వృద్ధుడు అయితే, తన వద్ద రెండు నోట్ల కట్టలు ఉన్నాయని, ఇదంతా భిక్షాటనతో తాను సంపాదించినదిగా వెల్లడించారు. మూడో వ్యక్తి వద్ద రూ. 3500 నగదు, పొడవైన కత్తి బయట పడింది. విచారించగా అతడు రామనాథపురంకు చెందిన కుమార్‌గా తేలింది. రాత్రుల్లో కొందరు గంజాయి మత్తులో వచ్చి వేధిస్తున్నారని, వారి నుంచి ఆత్మరక్షణ కోసం ఈ కత్తి పెట్టుకున్నట్టు పేర్కొనడంతో పోలీసులు విస్తుపోయారు. మిగిలిన వారు కూడా వివిధ కారణాలతో ఆశ్రమానికి వెళ్లేందుకు సమ్మతించలేదు. దీంతో వారికి పోలీసులు అవగాహన కల్పించారు. అందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
చదవండి: గోల్డ్ స్కామ్‌లో కీలక మలుపు: ప్రధాన సూత్రధారి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment