
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించే పలు వ్యాక్సిన్లు ప్రపంచం ముంగిట్లోకి వస్తోన్న నేటి తరుణంలో ‘ఫైజర్’ వ్యాక్సిన్ డోస్ తీసుకోవడం వల్ల ఓ నలుగురిలో పక్షవాత లక్షణాలు వచ్చాయనే వార్తలు ఆందోళన కలిగించక మానవు. నిజంగా వ్యాక్సిన్ల వల్ల ‘రియాక్షన్ లేదా సైడ్ ఎఫెక్ట్స్’ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏ వ్యాక్సిన్ల వల్ల రియాక్షన్ రావచ్చు, ఏ వ్యాక్సిన్ల వల్ల రియాక్షన్ రాకపోవచ్చు? రియాక్షన్ ప్రభావం ప్రాణాంతకంగా ఉంటాయా? సాధారణంగా ఉంటాయా? ఈ విషయంలో రోగ నిరోధక శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?...
బ్యాక్టీరియా, వైరస్, ఇతర పరాన్న జీవులు మానవుల శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని శరీరం ‘ఫారిన్ బాడీ’గా గుర్తించి దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే మానవుల్లో రోగ నిరోధక శక్తి పెరగుతుందని రోగ నిరోధక శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. అయితే ఆ ఫారిన్ బాడీ వల్ల తలెత్తే ముప్పు ఏమిటో గుర్తిస్తుందని ప్రముఖ రోగ నిరోధక శాస్త్రవేత్త చార్లెస్ జేన్‌వే 1989లోనే ఓ వ్యాసంలో పేర్కొన్నారు.
అయితే ఫారిన్ బాడీ ఏ రకానికి చెందినదో, దాని వల్ల కలిగే ముప్పు ఎలాంటిదో కనుగొనేందుకు మానవ శరీరంలోని జీవ కణాల్లో పలు రకాల సెన్సర్లు ఉంటాయని, సార్స్‌కు, కోవిడ్‌కు గల తేడాలను ఆ సెన్సర్లు గుర్తిస్తాయనే విషయం 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు రోగ నిరోధక శాస్త్రవేత్తలకు అవగాహనకు వచ్చింది. ఫారిన్ బాడీ దాడి వల్ల శరీరంలోని కణజాలం ఎంత వరకు దెబ్బతిన్నదో ఈ సెన్సర్లు గ్రహించడమే కాకుండా, ఏ స్థాయిలో సదరు ఫారిన్ బాడీని ఎదుర్కోవాలో కూడా గ్రహిస్తాయి. మోతాదుకు మించిన రోగ నిరోధక శక్తిని ఉపయోగించడం వల్ల కలిగే అనర్థాలేమిటో కూడా ఈ సెన్సర్లు అంచనా వేస్తాయి. మానవ శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌లను గుర్తించి వాటిని నిర్మూలించేవరకు మానవ శరీర కణాల్లో కొనసాగే ప్రక్రియకు సహజంగానే కొన్ని రోజుల కాలం పడుతుంది. ఈలోగా శరీరంలోని కొంత కణజాలం దెబ్బతినవచ్చు. ఇతర లోపాలు, జబ్బులు ఉన్నట్లయితే ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్ల వచ్చు. ( ‘వ్యాక్సిన్ల’ పై బ్రెజిల్ గుణపాఠం)
అందుకనే మన శరీరంలోకి చొచ్చుకుపోతున్న వైరస్ లేదా బ్యాక్టీరియా లాంటి సూక్ష్మ జీవుల ఆర్‌ఎన్‌ఏ లేదా డీఎన్‌ఏల నుంచి వ్యాక్సిన్లు తయారు చేస్తారు. వివిధ స్థాయిల్లో వీటి పనితీరును పరీక్షిస్తారు. సురక్షితమన్న అభిప్రాయం కుదిరాకే వివిధ పద్ధతుల్లో వ్యాక్సిన్ డోస్‌లను మానవ శరీరాల్లోకి పంపిస్తారు. తద్వారా ఫారిన్ బాడీని వెంటనే గుర్తించి మానవ శరీర కణజాలం రోగ నిరోధక శక్తిని (యాంటీ బాడీస్) త్వరిత గతిన అభివృద్ధి చేస్తుంది. అది ఫారిన్ బాడీని నాశనం చేస్తుంది. మనకు హాని కలిగించే వైరస్‌లను బలహీన పరిచి వాటి నుంచే వ్యాక్సిన్లను తయారు చేస్తారు. మానవ శరీరానికి మేలు చేసే గుడ్ బ్యాక్టీరియా, గుడ్ వైరస్‌లను మన రోగ నిరోధక శక్తి చంపకుండా వ్యాక్సిన్ తయారీలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకని ఓ వ్యాక్సిన్‌ను తయారు చేయాలంటే ఆ ల్యాబ్‌లోని యావత్ సిబ్బంది అత్యంత సమన్వయంతో కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ ఇచ్చిన చోట చర్మం ఎర్రగా కందిపోవచ్చు. గడ్డలాగా చర్మం బిగుసుకుపోవచ్చు. స్వెల్లింగ్ రావచ్చు. విపరీతంగా మంట పుట్టవచ్చు.
రోగ నిరోధక సెల్స్‌ను కండరాల్లోకి పంపించడం కోసం వ్యాక్సిన్ చేసిన చోట రక్త నాళాలకు సూక్ష్మ రంద్రాలు పడి నొప్పి పుట్టవచ్చు. ఒళ్లంతా సుస్థుగా ఉండవచ్చు. కొందరికి జ్వరం కూడా రావచ్చు. ఒకటి, రెండు సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉంటాయి. అందులో ఒకదాన్ని ‘అనఫాలాక్సీస్’ అంటారు. అది తీవ్ర స్థాయిలో ఎలర్జీ కలిగిస్తుంది. మరోదాన్ని ‘గిలియన్–బర్రీ సిండ్రోమ్’ అంటారు. మంటా, నొప్పి వల్ల నరాలు దెబ్బతినడం. అయితే ఐదు లక్షల వ్యాక్సిన్ డోసుల్లో ఒక డోస్ వల్ల ఏర్పడుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డాటా ప్రకారం ‘మోడర్నా’ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రెండు శాతం మందికి తల నొప్పి, అలసట లాంటి కాస్త తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. ఎవరికి ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. వ్యాక్సిన్ తీసుకోకుండా ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్‌ను తట్టుకొని ప్రాణాలు నిలుపుకోవడం మంచిదని రోగ నిరోధక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్లు తీసుకున్నా, తీసుకోక పోయినా వైరస్‌ల దాడి నుంచి, వ్యాధుల నుంచి శరీరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనషులుగా మనదేనని వారు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment