
సాక్షి బెంగళూరు: బెంగళూరులో స్థలం డీ నోటిఫికేషన్ కేసులో ముఖ్యమంత్రి యడి యూరప్పకు చుక్కెదురైంది. యడియూరప్పపై నమోదైన ఈ డీనోటిఫికేషన్ కేసు విచారణను మూసివేయాలని లోకాయుక్త విభాగం ఇచ్చిన బీ–రిపోర్టును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శనివారం తోసిపుచ్చింది. జడ్జి శ్రీధర్ గోపాలకృష్ణ ఆ బి–రిపోర్టును తిరస్కరిస్తూ నివేదిక సక్రమంగా లేదని, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనుసారం మళ్లీ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని తెలిపారు.
కేసు పూర్వపరాలు..
2000–01లో నగరంలోని వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ చుట్టుపక్కల భూములను ఐటీ కారిడార్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మారతహళ్లి, బెళ్లం దూరు, సర్జాపుర, దేవరబీసనహళ్లి, కాడుబీ సనహళ్లి, కరిమమ్మన అగ్రహార గ్రామాల్లోని 434 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటూ కేఐఏడీబీ ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బీఎస్ యడియూరప్ప కేఐఏడీబీ స్వాధీనం చేసుకున్న దేవరబీసనహళ్లి సర్వే నంబర్ 49లో ఉన్న 4.30 ఎకరాలు, బెళ్లందూరు గ్రామం సర్వే నంబర్ 46లో ఉన్న 1.17 ఎకరాలు, సర్వే నంబర్18లో ఉన్న 1.10 ఎకరం, సర్వే నంబర్ 10.33 గుంటల స్థలాలను అక్రమంగా డీనోటిఫై చేశారని 2013 జూలై 10న వాసుదేవ రెడ్డి అనే వ్యక్తి లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.
దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని లోకాయుక్త కోర్టు 2015, ఫిబ్రవరి 18న పోలీసులను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు 2015, ఫిబ్రవరి 21న ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి యడియూరప్పను ఏ2గా లోకాయుక్త పోలీసులు చేర్చారు. అయితే 2019, జనవరి 25న తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని యడియూరప్ప హైకోర్టును కోరగా ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఈ కేసులో విచారణను పారదర్శకంగా చేపట్టాలని లోకాయుక్త పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment