డబుల్‌ మ్యూటెంట్.. పేరు వింటేనే‌ దడపుట్టేస్తోంది! | Covaxin Effective Against Double Mutant Strain Found In India: ICMR | Sakshi
Sakshi News home page

డబుల్‌ మ్యూటెంట్.. పేరు వింటేనే‌ దడపుట్టేస్తోంది!

Published Thu, Apr 22 2021 2:16 AM | Last Updated on Thu, Apr 22 2021 11:48 AM

Covaxin Effective Against Double Mutant Strain Found In India: ICMR - Sakshi

డబుల్‌ మ్యూటెంట్‌... ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాల్లో దడ పుడుతోంది. భారత్‌లో తొలిసారిగా కనిపించి, 10 దేశాలకు విస్తరించిన ఈ కొత్త రకం మ్యూటెంట్‌ ఎంత ప్రమాదకరమో, వ్యాక్సిన్‌లకు లొంగుతుందో లేదో తెలియక, తలో మాట వినిపిస్తూ ఉండడంతో ఇంటా, బయటా డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియెంట్ల కంటే భారత్‌లో డబుల్‌ మ్యూటెంట్‌ మరింత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా కేంద్రం దానిని తక్కువ చేసిన చూపించడానికే ప్రయత్నాలు చేస్తోంది.

దేశంలో రోజుకి 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నప్పటికీ రెండుసార్లు రూపాంతరం చెందిన వైరస్‌కు, కేసుల పెరుగుదలకి ఎలాంటి సంబంధం లేదని వాదిస్తోంది. అయితే, ఈ డబుల్‌ మ్యూటెంట్‌ శరవేగంగా వ్యాపించడమే కాకుండా, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థని దెబ్బతీస్తుందని అశోకా యూనివర్సిటీ త్రివేది స్కూలు ఆఫ్‌ బయో సైన్సెస్‌ డైరెక్టర్, ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్‌ షాహిద్‌ జమీల్‌ చెప్పారు.  

10 దేశాల్లో డేంజర్‌ బెల్స్‌  
భారత్‌కు చెందిన డబుల్‌ మ్యూటెంట్‌ వైరస్‌ ఇప్పటివరకు ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, ఐర్లాండ్, నమీబియా, న్యూజిలాండ్, సింగపూర్, యూకే, యూఎస్, ఇజ్రాయెల్‌లో వెలుగులోకి వచ్చింది. బ్రిటన్, బ్రెజిల్‌ తరహా వేరియెంట్ల కంటే వ్యాప్తిలోనూ, రోగనిరోధక శక్తిని దెబ్బ తీయడంలోనూ ఇది ప్రమాదకరం కావడంతో డబ్ల్యూహెచ్‌వో కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.  

వ్యాక్సిన్‌కు లొంగుతుందా ? 
డబుల్‌ మ్యూటెంట్‌ వ్యాక్సిన్‌లకు లొంగుతుందా లేదా అన్న దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. భారత్‌ డబుల్‌ మ్యూటెంట్‌పై ఇజ్రాయెల్‌ చేసిన పరిశోధనల్లో ఫైజర్‌ వ్యాక్సిన్‌ ఈ వైరస్‌ను పాక్షికంగా అరికట్టగలదని తేల్చింది. ఆ మర్నాడే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ దీనిని సమర్థంగా అడ్డుకోగలదని వెల్లడించింది. కరోనాలో వివిధ రకాల వేరియెంట్లతో పాటుగా డబుల్‌ మ్యూటెంట్‌ని కూడా ఈ వ్యాక్సిన్‌ బలంగా అడ్డుకున్నట్టుగా ఐసీఎంఆర్‌ బుధవారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ‘‘కరోనా వైరస్‌ విజృంభణని అరికట్టడానికి గల అవకాశాలను పరిశీలించడానికి బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌ డబుల్‌ మ్యూటెంట్‌ కరోనా వైరస్‌ని విజయవంతంగా ఐసోలేట్‌ చేసి కల్చర్‌ చేశాము. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ అన్ని రకాల మ్యుటేషన్లను అడ్డుకుంటుందని మా పరిశోధనల్లో తేలింది’’అని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. కాగా తమ కోవాగ్జిన్‌ టీకా సాధారణ, సీరియస్‌ కోవిడ్‌ కేసుల్లో 78%  సమర్థతతో పనిచేస్తున్నట్లు మూడోదశ మధ్యంతర విశ్లేషణలో వెల్లడైందని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది.    – నేషనల్‌ డెస్క్, సాక్షి 

ఎంత ప్రమాదకరం  
►గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా డబుల్‌ మ్యూటెంట్‌ని కనుగొన్నారు.  
►రెండుసార్లు జన్యు మార్పిడికి లోనైన రూపాంతరాలు ఈ484క్యూ, ఎల్‌452ఆర్‌లు కలిసి కనిపించే ఈ కొత్త రకాన్ని బి.1.617 అని పిలుస్తున్నారు 
►మహారాష్ట్రలో మార్చిలో వచ్చిన కేసుల్లో 15–20 శాతం డబుల్‌ మ్యూటెంట్‌ ఉన్నప్పటికీ కేంద్రం దాని తీవ్రతను గుర్తించలేదు.  
►ప్రసుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో 52% డబుల్‌ మ్యూటెంట్‌ కేసులే కాగా ముంబై వంటి నగరాల్లో 60 శాతానికి పైగా ఇదే రకానికి చెందినవి.  
►డబుల్‌ మ్యూటెంట్‌ వైరస్‌ 20శాతం అధికవేగంతో వ్యాప్తి చెందుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థని 50% తగ్గిస్తుంది.  
►దేశంలోని 10 రాష్ట్రాల్లో డబుల్‌ మ్యూటెంట్‌ కేసులు కనిపిస్తున్నప్పటికీ నమోదవుతున్న కేసుల్లో తేడాలున్నాయి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement