ఏడాదికి 50 కోట్ల డోసులు | Covaxin phase III trial to soon begin in Bhubaneswar | Sakshi
Sakshi News home page

ఏడాదికి 50 కోట్ల డోసులు

Published Tue, Oct 27 2020 3:46 AM | Last Updated on Tue, Oct 27 2020 8:36 AM

Covaxin phase III trial to soon begin in Bhubaneswar - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణకు భారత బయోటెక్‌ తయారు చేస్తున్న టీకా కోవాగ్జిన్‌ మూడో దశ మానవ ప్రయోగాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 25–26 వేల మందిపై టీకాను ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, సమర్థత తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మూడో దశ మానవ ప్రయోగాలను నిర్వహిస్తున్నామ ని భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయి ప్రసాద్‌ ఓ ఇంగ్లిష్‌ పత్రికకు తెలిపారు. 25కుపైగా నగరాల్లో ప్రయోగాలు జరగవచ్చునని చెప్పారు.

కోవాగ్జిన్‌ టీకా తయారీ బాధ్యత మొత్తం భారత్‌ బయోటెక్‌దేనని, టీకా కొనుగోలు కోసం కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదని సాయి ప్రసాద్‌ తెలిపారు. కానీ, ఇప్పటికే కొన్ని డోసులను తయారు చేసి ఉంచామని తెలిపారు. ఏడాదికి 15 కోట్ల టీకా డోసులను తయారు చేయగల సామర్థ్యం ఉండగా దీన్ని 50 కోట్ల డోసులకు పెంచేందుకు హైదరాబాద్, మరో చోట ఫ్యాక్టరీలను సిద్ధం చేస్తున్నామన్నారు. టీకాలను భద్రపరిచే శీతల వ్యవస్థలు హైదరాబాద్, బెంగళూరు, అంకాలేశ్వర్‌లలో ఉన్నాయన్నారు. తమ టీకా కొనుగోలుకు 20 దేశాలు ఆసక్తి కనబరిచాయని చెప్పారు.

50 వేల లోపే కేసులు
దేశంలో గత 24 గంటల్లో 50 వేల కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో 50 వేల కంటే తక్కువ కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. సోమవారం 45,148  కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,09,959కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 480 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,19,014కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 71,37,228 కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,53,717గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 8.26 శాతం ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 90.23 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.50గా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement