సాక్షి, బెంగళూరు: కరోనా రెండో ఉధృతి కర్ణాటకలో కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 19,067 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. రాష్ట్ర కరోనా చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధిక రికార్డు కావడం గమనార్హం. బెంగళూరుతో సహా జిల్లా కేంద్రాలు కరోనా ముట్టడితో కుదేలయ్యాయి. మరోవైపు కరోనా నుంచి 4,603 మంది కోలుకున్నారు. మరో 81 మంది కరోనా కాటుకు బలి అయ్యారు.
11.61 లక్షలకు కేసులు
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,61,065 కి పెరిగింది. అందులో 10,14,152 మంది కోలుకున్నారు. ఇంకో 13,351 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,33,543 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అందులో 620 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
రాజధానిలో 12,793
సిలికాన్ సిటీలో ఎప్పటిమాదిరిగానే మెజారిటీ కేసులు వచ్చాయి. తాజాగా 12,793 పాజిటివ్‌లు, 2,560 డిశ్చార్జిలు, 60 మరణాలు నమోదయ్యాయి.
బెంగళూరులో ఇప్పటి వరకు 5,46,635 మందికి కరోనా సోకగా, అందులో 4,43,614 మంది కోలుకున్నారు. ప్రాణనష్టం 5,123 కి పెరిగింది.
నగరంలో ప్రస్తుతం 97,897 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
మరణాలు ఎక్కడెక్కడ ఎన్ని?
కోవిడ్ వల్ల ధారవాడలో 3, మైసూరులో 3, బళ్లారి, కొప్పళ, ఉత్తరకన్నడ, విజయపుర, యాదగిరిలో ఇద్దరు చొప్పున, బెళగావి, బీదర్, చామరాజనగర, మండ్య, తుమకూరులో ఒక్కొక్కరు మరణించారు.
22,065 మందికి టీకా
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 1,45,645 శాంపిళ్లను పరీక్షించారు. మొత్తం పరీక్షల సంఖ్య 2,35,93,654కు చేరింది.
22,065 మందికి కరోనా టీకా వేశారు. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా టీకా పొందిన వారి సంఖ్య 69,87,874కు చేరింది.
చితి ఆరని దహనవాటికలు
బెంగళూరులో కరోనా వల్ల మరణాలు పెరిగిపోవడంతో శ్మశానాలు కిటకిటలాడుతున్నాయి. పూడ్చడానికి చోటు లేక దహనం చేయడం అధికమైంది. పలు విద్యుత్ దహనవాటికల్లో మృతదేహాలు పేరుకుపోతున్నాయి. నిరంతరం దహనం చేస్తుండడంతో కొలిమి గొట్టాల నుంచి నల్లని పొగ కమ్ముకుంటూ భయాందోళన కలిగిస్తోందని స్థానికులు వాపోయారు. సుమనహళ్లి దహనవాటిక వద్ద ఇలాంటి పరిస్థితే ఆదివారం గోచరించింది. మృతుల బంధువుల రోదనలతో పరిసరాలలో విషాదం తాండవించింది. కోవిడ్ మారణహోమానికి అంతమెన్నడు అనే ప్రశ్న వినిపించింది.
లాక్‌డౌన్ రాకముందే సొంతూళ్లకు
బెంగళూరును వీడుతున్న వలస కూలీలు
సాక్షి, బెంగళూరు: విచ్చలవిడిగా చెలరేగుతున్న కరోనా నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని వస్తున్న వార్తల నేపథ్యంలో వలస కూలీలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. లాక్‌డౌన్ లేదా వారాంత లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. గతేడాది హఠాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు బెంగళూరులో ఉండలేక, వేలాది కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్లకు వెళ్లలేక ఎన్ని కష్టాలు పడిందీ అందరికీ తెలుసు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది కూలీలు, చిరుద్యోగులు, విద్యార్థులు బెంగళూరులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వలస కార్మికులతో కిక్కిరిసిపోతున్నాయి.
ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం
ఉప ఎన్నికల నేపథ్యంలో బసవకల్యాణ, మస్కి, బెళగావి ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇప్పటికే బెంగళూరు నగరాన్ని వీడారు. ఉప ఎన్నికలతో పాటు కోవిడ్ కేసులు కూడా పెరుగుతుండడంతో ముందస్తుగానే చాలా మంది నగరాన్ని వీడివెళ్లిపోయారు. ఇదే సమయంలో ఆర్టీసీ బంద్ ఉండడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించి మరీ సొంతూళ్లకు పయనమయ్యారు. మరోవైపు బెంగళూరు నగర శివార్లలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఉండే వారంతా తమ సొంత వాహనాల్లో వెనుదిరుగుతున్నారు.
లాక్‌డౌన్ ఉండదని చెబుతున్నా
ఇప్పటివకే అనేక ప్రముఖ ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ఇప్పుడు మధ్యతరహా, చిన్న సంస్థలు కూడా ఈ వసతిని కల్పించగా పొరుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు వీడ్కోలు చెబుతున్నారు. లాక్‌డౌన్ తీసుకొచ్చే యోచన లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెబుతున్నా కార్మికులు నమ్మడం లేదు. గతేడాది అనుభవాలతో ఈసారి ముందుగానే సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా బెంగళూరు ప్రగతిలో ముఖ్యమైన నిర్మాణ, సేవా రంగాలు కుంటుపడే ప్రమాదముంది.
బెంగళూరులో లాక్‌డౌన్ ఉండదు
శివాజీనగర: ప్రస్తుతానికి రాష్ట్రంలో లాక్‌డౌన్ అవసరం లేదని, ప్రభుత్వం ముందు కూడా లాక్‌డౌన్ ప్రస్తాపన ఉండదు. అయితే బెంగళూరులో సోమవారం నుంచి కఠిన నియమాలు జారీ అవుతాయి అని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్ వల్ల చాలా సమస్యలు వచ్చాయన్నారు. సాధారణ ప్రజల జీవితాలను కూడా చూడాలి. కాబట్టి ఇది కాకుండా కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తామన్నారు. సోమవారం జరిగే సమావేశంలో తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాను రాష్ట్ర విపత్తు నిర్వహణ ఉపాధ్యక్షునిగా ముఖ్యమైన స్థానంలో ఉన్నందున ఈ సమావేశాన్ని నిర్వహిస్తానని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు.
ప్రత్యేక కార్యాచరణ: మంత్రి
బెంగళూరులో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి కే.సుధాకర్ తెలిపారు. ఆదివారం ఆస్పత్రికి వెళ్లి కరోనాతో చికిత్స పొందుతున్న సీఎం యడియూరప్పను ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ మంత్రి అశోక్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ఏమేం చర్యలు చేపట్టాలో చర్చిస్తామన్నారు. ఉన్నతాధికారులు, నగరపరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. కరోనా సోకినవారు ఆందోళన చెందకుండా తగిన చికిత్స తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment