సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కోవిడ్ విధ్వంసం ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. బుధవారం 39,047 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 14.39 లక్షలకు పెరిగింది. 11,833 మంది కోలుకున్నారు. దీంతో డిశ్చార్జ్‌లు 10.95 లక్షలకు చేరాయి. ఇప్పటికీ 3,28,884 మంది కోవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివిటీ రేటు 22.70 శాతానికి పెరిగింది. అలాగే మరణాల రేటు 0.58 శాతంగా నమోదయింది. ఇక 2,192 మంది ఐసీయూల్లో ఉన్నారు.
మృత్యు ఘంటికలు..
కోవిడ్ మరణ ఘంటికలను మోగిస్తోంది. బుధవారం ఏకంగా 229 మందిని కరోనా ప్రాణాలు తీసింది. ఇందులో బెంగళూరువాసులు 137 మంది ఉన్నారు.
రాష్ట్రంలో మొత్తం మరణాలు 15,036 మందికి పెరిగాయి.
తాజాగా బెంగళూరులో 22,596 మంది కరోనా బారినపడగా, మరో 4,530 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 2,24,152 మంది బాధితులు ఉన్నారు.
కొత్తగా 1,66,407 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. మరోవైపు 1,33,077 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
లాక్‌డౌన్ ప్రారంభం..
విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌ను నిలువరించడానికి ప్రభుత్వం చివరి అస్త్రంగా లాక్‌డౌన్‌ను విధించింది. నగరాలు, గ్రామాలు అన్నీ దిగ్బంధం అయ్యాయి. ఉదయం 6 నుంచి 10 వరకు నిత్యావసరాలకు సడలింపు తరువాత పోలీసులు రోడ్లమీదకు వచ్చారు. బయటకు వచ్చేవారిని నిలువరించారు. ప్రైవేటు ఉద్యోగులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. బస్సు సర్వీసులు దాదాపు రద్దయ్యాయి. పలుచోట్ల ప్రజలు–పోలీసులు మధ్య వాగ్వాదాలు జరిగాయి.
తాజా కేసుల్లో టాప్–10 జిల్లాలు
1. బెంగళూరు : 22,596
2. మైసూరు : 1,759
3. కోలార్ : 1,194
4. తుమకూరు : 1,174
5. బళ్లారి : 1,106
6. హాసన్ : 1,001
7. మండ్య : 935
8. కలబురిగి : 901
9. బెంగళూరు రూరల్ : 732
10. చిక్కబళ్లాపుర : 683
కోవిడ్ రోగులు మాయం
బనశంకరి: కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు మొబైల్‌ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుని అందుబాటులో లేరు. బెంగళూరులో సుమారు 2–3 వేల మంది అడ్రస్ లేరు. వీరిలో ఎక్కువమంది ఇళ్లు ఖాళీ చేసుకుని వెళ్లిపోయారు. రెవెన్యూమంత్రి అశోక్ ఈ సమస్యపై స్పందిస్తూ ఇటువంటి వారి వల్ల కరోనా వైరస్ విస్తరిస్తుందని వాపోయారు. వారి ఆచూకీని కనిపెడతామన్నారు. కాగా, నగరంలో కరోనా లక్షణాలు కనబడగానే ఐసీయూ బెడ్ కావాలని వస్తున్నారని, దీంతో సమస్య తలెత్తుతోందని విచారం వ్యక్తం చేశారు. బెంగళూరులో ప్రస్తుతం 13 కోవిడ్ సెంటర్లను తెరిచామని చెప్పారు.
లాక్‌డౌన్‌కు విశేష స్పందన
శివమొగ్గ: కరోనాను కట్టడి చేసేందుకు మంగళవారం రాత్రి నుంచి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు జిల్లా ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. బుధవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అత్యవసర వస్తువుల కోనుగోలుమాత్రమే ప్రజలు బయటకు వచ్చారు. తర్వాత దుకాణాలు పూర్తిగా మూసివేయడంతో శివమొగ్గలో జనసంచారం లేక బంద్ వాతావరణం కనిపించింది.
తుమకూరు: జిల్లాలో లాక్‌డౌన్ ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, కూరగాయల, ఆహార పదార్థాల కోనుకోలు చేయడానికి అవకాశం కల్పించినా ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. దీంతో ఉదయం నుంచే రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment