సాక్షి, బెంగళూరు: కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఆంక్షలను అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 596 మంది కరోనా కాటుకు విగతజీవులయ్యారు. కొత్తగా 39,305 మందికి పాజిటివ్ రాగా, 32,188 మంది కోలుకున్నారు. గత నాలుగురోజులతో పోలిస్తే పాజిటివ్‌లు తగ్గినా, మరణాలు పెరిగాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 19,73,683 కి చేరగా, అందులో 13,83,285 మంది కోలుకున్నారు. 19,372 మంది ప్రాణాలు విడిచారు. 5,71,006 మంది ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు.
బెంగళూరులో 16,747..
సిలికాన్ సిటీ బెంగళూరులో తాజాగా 16,747 కేసులు, 14,289 డిశ్చార్జిలు, 374 మరణాలు నమోదయ్యాయి. బెంగళూరులో ఇప్పటివరకు 9,67,640 మందికి కరోనా సోకగా, అందులో 6,06,754 మంది కోలుకున్నారు. మరో 8,431 మంది కన్నుమూశారు. నగరంలో ప్రస్తుతం 3,52,454 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాలవారీగా తాజా మరణాలు..
బెంగళూరులో 374, బళ్లారిలో 26, హాసన్‌లో 22, భాగల్‌కోటెలో 15, తుమకూరులో 15, హావేరిలో 12, శివమొగ్గలో 11, ఉత్తర కన్నడలో 11, కొడగులో 9, ధారవాడలో 8, కోలారులో 8 మంది చొప్పున కన్నుమూశారు.
80,823 మందికి టీకా..
- కొత్తగా 1,24,110 శాంపిళ్లు పరీక్షించారు. మొత్తంటెస్టులు 2,71,42,330 కి చేరాయి.
- మరో 80,823 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. మొత్తం టీకాలు 1,06,08,539 కి పెరిగింది. అనేక నగరాల్లో టీకాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. దావణగెరెలో అయితే తోపులాటలు కూడా జరగడంతో పోలీసులు అదుపుచేశారు.
- మంగళూరుకు నౌకలో 54 టన్నుల ఆక్సిజన్ సోమవారం చేరుకుంది. కువైట్, ఖతార్‌ల నుంచి ఇది వచ్చింది.
- పటిష్ట లాక్‌డౌన్ వల్ల బెంగళూరులో వచ్చే వారంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టవచ్చని నిపుణులు తెలిపారు. ఈ నెల 17వ తేదీ తర్వాత రెండో ఉధృతి శాంతిస్తుందని జోస్యం చెప్పారు.
2 వారాలు ఇల్లే భద్రం
సాక్షి, బెంగళూరు: ప్రాణాలను హరించివేస్తున్న కరోనా రక్కసిని ఎలాగైనా కట్టడి చేయాలని రాష్ట్రంలో రెండోదఫా విధించిన సంపూర్ణ లాక్‌డౌన్ సోమవారం ఉదయం నుంచి ఆరంభమైంది. ఇకనుంచి రెండువారాల పాటు జన జీవితానికి రోజుకు 4 గంటలే విరామం. మిగతా 20 గంటలూ ఇళ్లకే పరిమితం కావాలి.
అతిక్రమిస్తే లాఠీ, సీజ్‌లు..
తొలిరోజు నిబంధనల ప్రకారం నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతించారు. ఆ తర్వాత రోడ్డెక్కిన వారిపై పోలీసులు లాఠీలను ఝళిపించారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 10 గంటలు దాటినా పని లేకుండా బయటకు వచ్చినవారిపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు వాహనాలను జప్తు చేశారు. వ్యాపారులకూ జరిమానా వేశారు. పలుచోట్ల ప్రజలు వాగ్వాదానికి దిగారు. పాస్ ఉన్నా ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. బెంగళూరులోని చిన్నమ్మ సర్కిల్, మహంతేశ్‌నగర్ ఓవర్ బ్రిడ్జి, అశోక్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనదారులను పోలీసులు అడ్డుకున్నారు.
జిల్లా సరిహద్దుల్లో బంద్..
లాక్‌డౌన్ 2.ఓ కారణంగా జిల్లాల మధ్య సరిహద్దుల దాటేవారిని పోలీసులు అనుమతించలేదు. వలసకార్మికులు, దూర ప్రయాణికులు రైళ్లను ఆశ్రయించారు. లాక్‌డౌన్ భయంతో వలస కార్మికులు సామాన్లు నెత్తిన పెట్టుకుని స్వస్థలాలకు బయలుదేరిన దృశ్యాలు బెంగళూరులో సాధారణమయ్యాయి. పట్టణాలు, గ్రామాల్లో విరామ సమయంలోనూ బైకిస్టులను బయటకు రానివ్వలేదు.
సహకరించండి ప్లీజ్: సీఎం
రాష్ట్రంలో కరోనా వైరస్ జెడ్ స్పీడుతో దూసుకెళ్తోంది, నివారణ కోసం లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరు పాటించాలని సీఎం బీఎస్ యడియూరప్ప ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ప్రజల సహకరిస్తేనే కరోనా కట్టడి సాధ్యమన్నారు. నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులందరూ అందుబాటులో ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment