మెజిస్టిక్ రైల్వేస్టేషన్‌లో లగేజీతో వలసవాసులు
సాక్షి, బెంగళూరు/బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో బెంగళూరు నుంచి ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థులు లగేజి సర్దుకుని సొంత ఊళ్ల బాటపట్టారు. ఇప్పటికే వీకెండ్ కర్ఫ్యూ, మినీ లాక్‌డౌన్ నేపథ్యంలో పెద్దఎత్తున వలస ప్రజలు బెంగళూరును వదిలివెళ్లారు. సోమవారం సీఎం యడియూరప్ప మంగళవారం రాత్రి నుంచి లాక్‌డౌన్ అనగానే ప్రజలు తమ లగేజీ, పిల్లలతో కెంపేగౌడ బస్టాండు, శాటిలైట్, శాంతినగర, కేఆర్.మార్కెట్, మెజెస్టిక్, యశవంతపుర, కంటోన్మెంట్, కృష్ణరాజపుర రైల్వేషన్లకు బయల్దేరారు. బతుకుతెరువు కోసం బెంగళూరుకు వచ్చామని, కరోనా, లాక్‌డౌన్ భయాల మధ్య జీవించడం కష్టంగా మారిందని కొందరు ఆవేదన చెందారు. ఒకవైపు ఉపాధి కరువై, మరోవైపు ప్రాణభయం వలసవాసులను పీడిస్తోంది. పుట్‌పాత్ వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ప్రైవేటు చిరుద్యోగుల జీవితాల్లో కల్లోలం నెలకొంది.
వెంటాడుతున్న కోవిడ్ భూతం..
గతేడాది లాక్‌డౌన్ సమయంలో బస్సులు, రైళ్లు దొరక్కపోవడంతో వందలాది కిలోమీటర్లు నడుచుకుని వెళ్లాల్సి వచ్చింది. కరోనా తగ్గుముఖం పడితే మళ్లీ వెనక్కి వస్తామని పలువురు తెలిపారు. మేలో కరోనా భూతం మరింతగా విజృంభిస్తుందని నిపుణులు ప్రకటించడంతో బెంగళూరు క్షేమం కాదని నిశ్చయించుకున్నారు. సొంతూర్లో విశ్రాంతి తీసుకోవడమో, పొలం పనులు చేయడమో తప్పదని అన్నారు. ఇప్పటికే లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిలో ఉన్నారు. వారిలో అనేకమంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. వ్యాపారులకు, చిరుద్యోగులకు అటువంటి సౌలభ్యం లేదన్నది తెలిసిందే. వలసవాసుల ప్రయాణాలతో నగరం నలువైపులా రహదార్లు కిక్కిరిసిపోగా టోల్‌గేట్ల వద్ద ఒత్తిడి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment