థర్డ్‌ వేవ్‌ కోసం సంసిద్ధం | Covid-19: Preparing For The Third Wave | Sakshi
Sakshi News home page

థర్డ్‌ వేవ్‌ కోసం సంసిద్ధం

Published Fri, Jul 23 2021 3:56 AM | Last Updated on Fri, Jul 23 2021 3:56 AM

Covid-19: Preparing For The Third Wave - Sakshi

సాక్షి, ముంబై: కరోనా మూడో వేవ్‌ ఆగస్టు తరువాత వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) పరిపాలనా విభాగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. మూడో వేవ్‌లోనూ కరోనాను నియంత్రించేందుకు అవసరమైన సామగ్రి, వైద్య సిబ్బందిని సమకూర్చుకుని సిద్ధంగా ఉంచే పనిలో పడింది. ఈ క్రమంలోనే దహిసర్, మలాడ్, నేస్కో, వర్లీలోని ఎన్‌ఎస్‌సీఐ–డోమ్, భైకళలోని రిచర్డ్‌సన్‌ అండ్‌ కృడ్డాస్, ములుండ్‌ తదితర జంబో కోవిడ్‌ సెంటర్లలో సమారు 20 వేల పడకలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది.

వీటితోపాటు మహాలక్ష్మిలోని రేస్‌ కోర్స్, కాంజూర్గ్‌ మార్గ్, సోమయ్య మైదానంలో కొత్త జంబో కోవిడ్‌ సెంటర్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నాయర్, కస్తూర్భా, కేం, సైన్, కూపర్‌ తదితర ప్రధాన ఆస్పత్రులతో పాటు ఉప నగరాల్లో ఉన్న 16 ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌లలో కూడా పడకలు సమకూర్చి సిద్ధంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్‌ సురేశ్‌ కాకాని తెలిపారు. ఇదిలావుండగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు బీఎంసీ ద్వారా చేపడుతున్న చర్యలు, ప్రభుత్వం జారీ చేసిన లాక్‌డౌన్, కఠిన ఆంక్షల వల్ల ముంబైలో రెండో దఫా కరోనా చాలా శాతం వరకు నియంత్రణలోకి వచ్చింది. దీంతో కరోనా రికవరీ శాతం కూడా 97 శాతం వరకు చేరుకుంది.

అయినప్పటికీ మూడో దఫా కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా బీఎంసీ జంబో కోవిడ్‌ సెంటర్లు నెలకొల్పడం ప్రారంభించింది. బీఎంసీ, ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌లలో కూడా అవసరాన్ని బట్టి పడకలను సమకూర్చి సిద్ధంగా ఉంచనున్నట్లు సురేష్‌ తెలిపారు. సోమయ్య మైదానంలో 1,200 బెడ్ల సామర్థ్యం గల కోవిడ్‌ సెంటర్‌ను నిర్మించడం వల్ల చెంబూర్, మాహుల్, ట్రాంబే, దేవ్‌నార్, గోవండీ, కుర్లా, చునాబట్టి, సైన్‌ ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా చిన్న పిల్లల కోసం నిర్మించనున్న 1,500 బెడ్లతో కూడిన సెంటర్‌లో 70 శాతం ఆక్సిజన్‌ బెడ్లు, 10–15 శాతం ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉండనున్నాయి. దీంతోపాటు పాత, కొత్త జంబో కోవిడ్‌ సెంటర్లలో పీడియాట్రిక్‌ వార్డు కూడా ఉండనుంది. దీంతో కోవిడ్‌ బారిన పడిన పిల్లలకు వెంటనే వైద్యం అందుతుందని బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఆశిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement