
సాక్షి, బెంగళూరు/బనశంకరి: కరోనా నియంత్రణ కోసం శనివారం రాత్రి విధించిన నైట్ కర్ఫ్యూతో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ణాటక రాజధాని నగరం నిశ్శబ్దంగా మారింది. కోవిడ్ కట్టడికి బెంగళూరుతో కలిపి 8 నగరాల్లో ఈ నెల 20 వరకు నైట్ కర్ఫ్యూ జారీచేయడం తెలిసిందే. శనివారం రాత్రి 10 గంటలకల్లా బెంగళూరులో అన్ని రోడ్లు, వంతెనలను పోలీసులు మూసివేశారు. బయటకు రాకూడదని హొయ్సళ వాహనాల ద్వారా మైకుల్లో ప్రచారం చేశారు. 20వ తేదీ వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ ప్రకటించారు. జాలీరైడ్లు చేసేవారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానా విధిస్తామని ఖాకీలు ప్రకటించడంతో యువత ఇళ్లకే పరిమితమయ్యారు.
9 గంటలకే బంద్
మాల్స్, హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్,క్లబ్స్ తో పాటు వాణిజ్యకేంద్రాలకు రాత్రి 9 గంటలకే బంద్ చేశారు. కళ్యాణ మండపాల్లో రాత్రి 9 గంటలకల్లా కార్యక్రమాలు పూర్తయ్యేలా పోలీసులు నిఘా వేశారు. బార్లు, పబ్‌లను కూడా మూసివేయించడంతో ఎంజీ, బ్రిగేడ్ తదితర ముఖ్యరోడ్లు వెలవెలబోయాయి. నగరంలో సుమారు 180 చోట్లకు పైగా రోడ్లు, బ్రిడ్జిల వద్ద చెక్‌పోస్టులను పెట్టారు. పని లేకున్నా బయటకు వచ్చారని నగర ఆగ్నేయ విభాగంలో 55 బైక్‌లు, ఐదు నాలుగుచక్రాల వాహనాలను సీజ్ చేశారు.
17 తరువాత లాక్‌డౌన్?
కోవిడ్ రెండో దాడి కట్టడికి యడ్డీ సర్కారు చర్యలు?
శివాజీనగర: కోవిడ్ రెండో దాడి దూకుడుని అరికట్టడానికి మూడు నియోజకవర్గాల ఉప ఎన్నికలు ముగిసిన తరువాత రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ అమలు కావచ్చని జోరుగా వార్తలు వస్తున్నాయి. శనివారం నుంచి 10 రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ జారీ చేయడం తెలిసిందే. 17న బెళగావి లోక్‌సభా, మస్కి, బసవ కళ్యాణ అసెంబ్లీ సీట్లకు పోలింగ్ ముగిసిన తరువాత దిగ్బంధం జారీ కావచ్చని ప్రభుత్వ వర్గాల కథనం.
వైద్య ఆరోగ్య మంత్రి కే.సుధాకర్ ఈ విషయమై ఆదివారం స్పందిస్తూ రాష్ట్ర ప్రజలు తక్షణమే మేల్కొని కోవిడ్–19 మార్గదర్శకాలను పాటించకపోతే లాక్‌డౌన్ జారీ చేయటం అనివార్యమవుతుందని హెచ్చరించారు. మహారాష్ట్రలో ప్రజలు నియమాలను పాటించకపోవడంతో ప్రతి శుక్రవారం నుంచి సోమవారం వరకు లాక్‌డౌన్ విధిస్తున్నారని తెలిపారు.
టీకా ఉత్సవం ఆరంభం
సందేహాలను విడిచిపెట్టి 45 ఏళ్లు దాటిన అందరూ టీకా వేయించుకోవాలని సీఎం యడియూరప్ప, ఆరోగ్య మంత్రి సుధాకర్‌లు రాష్ట్ర ప్రజలకు విన్నవించారు. ఆదివారం నుంచి బుధవారం వరకూ కరోనా టీకా ఉత్సవంలో భాగంగా ఎక్కువమందికి టీకాలను వేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment