సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో భయాందోళనలకు కారణమైన కరోనా సంక్రమణను కట్టడి చేసేందుకు జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం మందగించింది. దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత వ్యాక్సినేషన్ సగటు వేగం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆశాజనకంగానే కొనసాగింది. అయితే మే నెలలో వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నవారి సంఖ్య తగ్గింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో 37% డోస్‌లు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మూడోదశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 18–44 ఏళ్ల వయసు వారికి మే 1 నుంచి టీకాలు వేయడానికి కేంద్రం అనుమతించిన విషయం ఇక్కడ గమనార్హం.
అసలు వ్యాక్సిన్ లభ్యత ఎంతుందో చూసుకోకుండా.. మూడోదశ ప్రకటించారని, టీకాల ఉత్పత్తే సరిపడా లేని సమయంలో రాష్ట్రాలపై భారం వేసేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకొందని పలువురు ముఖ్యమంత్రులు విమర్శించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో పలు రాష్ట్రాలు 18–44 ఏళ్ల వయసుల వారికి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేశాయి. కొన్నిచోట్ల ప్రారంభమయ్యాక కేంద్రాలను మూసివేశాయి. గ్లోబల్ టెండర్లకు కూడా వెళ్లాయి. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో వ్యాక్సినేషన్ గణనీయంగా తగ్గడం రాష్ట్రాల వాదనకు బలం చేకూరుస్తోంది.
జనవరి–ఫిబ్రవరి నెలల్లో మొత్తం 1.42 కోట్ల డోస్‌లు కేంద్రానికి చేరగా, అందులో 1.16 కోట్లు మొదటి డోస్‌లు, 0.26 కోట్లు రెండవ డోస్‌లు వేశారు. మార్చి నెలలో 5.36 కోట్ల వ్యాక్సిన్లు రాగా... రోజుకి 17.3 లక్షల చొప్పున వ్యాక్సిన్లు ప్రజలకు వేశారు. మే నెలలో 8.72 కోట్ల కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు సగటున రోజుకి 29 లక్షల డోస్‌లను అందించారు. అదే మే నెలలో ఇప్పటివరకు 4.56 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు రాగా అందులో రోజుకి సగటున 18.2లక్షల వ్యాక్సిన్లు ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా శనివారం ఉదయం వరకు మొత్తం 20,89, 02,445 డోస్‌లు ఇచ్చారు. ఇందులో 16,47,79,253 మొదటి డోస్‌లు ఇవ్వగా, 4,41,23,192 రెండవ డోస్‌లు అందించారు.
మహారాష్ట్రలో అత్యధికం
రాష్ట్రాల వారీగా వ్యాక్సినేషన్ డ్రైవ్ పరిశీలిస్తే, మొదటి, రెండవ డోస్‌లు కలిపి చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 2.19 కోట్ల డోస్‌లు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 1.76కోట్లు, రాజస్థాన్, గుజరాత్‌ల్లో 1.65 కోట్లు, పశ్చిమబెంగాల్‌లో 1.39 కోట్లు వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. అయితే శుక్రవారం ఒక్కరోజులో దేశంలో మొత్తం 30.62 లక్షల డోస్‌ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు ఈ ఏడాది డిసెంబరు నాటికి 108 కోట్ల మందికి రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల ప్రకటించారు.
మారిన విధానం....
ఏప్రిల్‌లో కేంద్రం రూపొందించిన విధానం ప్రకారం దేశంలో తయారుచేసిన వ్యాక్సిన్ డోస్‌ల్లో సగం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి 45 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా ఇవ్వడానికి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. మిగిలిన 50 శాతం వ్యాక్సిన్ డోస్‌లను రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు నేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ విధానంతో పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీతో సహా కొన్ని రాష్ట్రాలు 18–44 సంవత్సరాల మధ్య ఉన్నవారికి వ్యాక్సినేషన్ ప్రణాళికను వాయిదా వేశాయి. అంతేగాక వ్యాకిన్ల కొరతను తగ్గించుకొనేందుకు రాష్ట్రాలు విదేశాల నుంచి వ్యాక్సిన్‌లను నేరుగా కొనుక్కోవచ్చని కేంద్రం ఆ భారాన్ని రాష్ట్రాలపై వదిలేసింది. కానీ విదేశీ ఫైజర్, మోడెర్నా వంటి సంస్థలు నేరుగా రాష్ట్రాలకు వ్యాక్సిన్లను విక్రయించలేమని, కేవలం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే తమ చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి.
(చదవండి: రాందేవ్ బాబా వ్యాఖ్యలపై 1న దేశవ్యాప్త నిరసన)
దేశంలో తగ్గిన వ్యాక్సినేషన్..లోపం ఎక్కడ?
Published Sun, May 30 2021 9:11 AM | Last Updated on Sun, May 30 2021 9:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment