దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల గ్రూపు వారికి సోమవారం ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్‌లో తొలిరోజు 41 లక్షల మందికి పైగా మొదటి డోసు టీకా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 15–18 ఏళ్ల వారి కోసం జనవరి ఒకటో తేదీ నుంచి కోవిన్ పోర్టల్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, సోమవారం రాత్రి 8.30 గంటల సమయానికి 51 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో ఈ గ్రూపు బాలబాలికలు సుమారు 7.4 కోట్ల మంది ఉన్నట్లు అధికారుల అంచనా. ‘మహమ్మారి నుంచి యువతరాన్ని కాపాడేందుకు దేశం ఒక అడుగు ముందుకు వేసింది’అని ప్రధాని మోదీ అన్నారు. ‘టీకా వేయించుకున్న బాలలందరికీ, వారి తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరింతమంది టీకా వేయించుకోవాలని కోరుకుంటున్నాను’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 146.61 కోట్ల డోసుల టీకా పంపిణీ చేసినట్లయిందని ఆరోగ్య శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment