
ఉత్తర భారతదేశంలో జరిగిన ఒక కార్యక్రమంలో బౌద్ద మత గురువు దలైలామా ఒక బాలుడి పెదవులపై ముద్దుపెట్టుకుని, నాలుకను ముద్దు పెట్టమని కోరడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన అనుసరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ అంశంపై దలైలామా ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ బాలుడు, అతని కుటుంబసభ్యులకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
సోమవారం దలైలామా బృందం విడుదల చేసిన ప్రకటనలో.. దలైలామా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. బాలుడు, అతని కుటుంబ సభ్యులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులకు క్షమాపణలు చెప్పారు. దలైలామాను కలిసే వ్యక్తులు, ముఖ్యంగా చిన్నారులతో ఆయన సరదాగా ఉంటారు. కొన్ని సార్లు వారిని ఆటపట్టిస్తుంటారు. అయితే బాలుడి ఘటనకు ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.
కాగా ఓ కార్యక్రమంలో తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై దలైలామా ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరారు. దీంతో ఈ ఘటన వివాదానికి తెరలేపింది. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారేంటని నెటిజన్లు ఫైర్ అయ్యారు.