సాక్షి, న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై అందరితో చర్చించాకే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన ఆమె పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థాగతంగా రాష్ట్రంలో చేయాల్సిన మార్పులపై అధిష్టానానికి నివేదిక అందించారు. పొత్తుల గురించి నిర్ణయం తీసుకునేందుకు ఇంకా సమయం ఉందని, ఎన్నికలకు ముందు పొత్తుల గురించి నిర్ణయం ఉంటుందని పురందేశ్వరి భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్‌ను కలిసి ఏపీ ఆర్ధిక పరిస్థితులను వివరించానని పురందేశ్వరి తెలిపారు.
‘నేనేం తప్పులు చెప్పలేదు’
ఇటీవల మీడియా సమావేశంలో ఏపీ ఆర్థిక పరిస్థితుల గురించి తాను తప్పులు చెప్పలేదని.. 2023 జూలై నాటికి ఏపీకి రూ.10,77,006 కోట్ల అప్పు ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు. కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు అధికారికమా, అనధికారికమా అన్నది ఏపీ ప్రజలకు తెలియాలన్నారు. రాష్ట్రంలో చిన్న సన్నకారు కాంట్రాక్టర్లకు రూ.71 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. 15వ ఆర్థిక సంఘం పంచాయతీ నిధులను అనధికారికంగా వాడటంపై సర్పంచ్‌లకు సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. నిధులు దారి మళ్లించి అప్పులు తీసుకువచ్చి ఆ భారాన్ని ప్రజలపై రద్దుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి లేదని.. అప్పులు మాత్రమే ఉన్నాయని పురందేశ్వరి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment