కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌ | Delhi CM Arvind Kejriwal Plea For Extension Of Bail Not Heard By Supreme Court, More Details Inside | Sakshi
Sakshi News home page

Delhi Liquor Scam Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో బిగ్‌ షాక్‌

Published Wed, May 29 2024 11:12 AM | Last Updated on Wed, May 29 2024 11:38 AM

Delhi CM Kejriwal Plea For Extension Of Bail Not Heard By Supreme Court

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో భారీ షాక్‌ తగిలింది. మధ్యంతర బెయిల్‌ను మరో వారం పొడిగించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది. ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని బుధవారం ఉదయం స్పష్టం చేసింది.

లిక్కర్‌ స్కాం కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌కు ఇదివరకే అనుమతి లభించింది. అందుకే ఆయన వేసిన మధ్యంతర బెయిల్‌ పొడిగింపు పిటిషన్‌ చెల్లదని సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌ స్పష్టం చేశారు. 

అంతకు ముందు.. మంగళవారం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న కేజ్రీవాల్‌ అభ్యర్థనకు సైతం సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ బెంచ్‌ ముందుకు వెళ్తుందని అంతా భావించారు. కానీ, దిగువ కోర్టులో బెయిల్‌ వేసేందుకు అనుమతి ఉండడంతో.. సుప్రీం విచారణ చేపట్టమని పేర్కొంది. 

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఆపై జ్యుడీషియల్‌ రిమాండ్‌ కింద ఆయన తీహార్‌ జైల్లో ఉన్నారు. అయితే.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆప్‌ తరఫున ప్రచారం చేసేందుకు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది సుప్రీం కోర్టు. జూన్‌ 1వరకు బెయిల్‌ వర్తిస్తుందని, తిరిగి జూన్‌ 2వ తేదీన లొంగిపోవాలని స్పష్టం చేసింది.

కానీ, ఈలోపే ఆరోగ్య పరీక్షల నిమిత్తం తన మధ్యంతర బెయిల్‌ గడువును పొడిగించాలని ఆయన మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్‌ తన పిటిషన్‌లో కోరారు. జూన్‌ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు. 

అయితే.. మంగళవారం విచారణ సందర్భంగా.. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం ముందు గత వారం ఈ అభ్యర్థనను ఎందుకు ప్రస్తావించలేదని ఆప్‌ నేత తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్విని వెకేషన్‌ బెంచ్‌ ప్రశ్నించింది. ‘ఈ పిటిషన్‌పై సీజేఐ నిర్ణయం తీసుకోవడమే సముచితం. ఆయన వద్దకు దీనిని పంపిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. కేజ్రీవాల్‌కు ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందన్న వైద్యుడి సూచనలు రెండు రోజుల క్రితమే అందినందున జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడం సాధ్యం కాలేదని సింఘ్వి వెకేషన్‌ బెంచ్‌కు తెలిపారు. వర్చువల్‌ విధానంలో అయినా సరే ఆ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్తామంటే అభ్యంతరం లేదని సింఘ్వి వాదించారు. ప్రధాన పిటిషన్‌పై తీర్పు రిజర్వులో ఉన్నందున బెయిల్‌ పొడిగింపు అభ్యర్థన లిస్టింగ్‌పై సీజేఐ నిర్ణయం తీసుకుంటారని జస్టిస్‌ జె.కె.మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement