
ఢిల్లీ: దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈడీ సంజయ్ సింగ్‌ను కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు సంజయ్ సింగ్‌ను ఈ నెల 10 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కోర్టు ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. బుధవారం సంజయ్‌ను అధికారులు కోర్టులో హాజరు పరచగా.. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు ఆయన్ను ఈ నెల 10 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తొలుత ఈడీ అధికారులు సంజయ్ సింగ్‌ను పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వాదనలు వినిపించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోరా.. సంజయ్‌కు డబ్బులు ఇచ్చినట్టు రికార్డు చేసిన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించిన డిజిటల్ ఆధారాన్ని సైతం స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మరోవైపు, ఈడీ అధికారులు సంజయ్ సింగ్‌ను అవమానించేందుకే అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈడీ అరెస్టు చేసిన దినేశ్ అరోడా అప్రూవర్‌గా మారారని.. ఈ కేసులో ముందుగా ఎప్పుడూ సమన్లు కూడా ఇవ్వలేదని వాదించారు. ఇదిలా ఉండగా.. తన అరెస్ట్‌కు ముందు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని అందులో పేర్కొన్నారు. చావనైనా చస్తాను కానీ, తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అదానీ స్కామ్‌లను తాను బహిర్గతం చేశానని, ఈడీకి ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఓటమి తప్పదని, దాడులు, అరెస్టులు వంటి వాటి ద్వారా విజయం సాధించలేరని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ తనను బలవంతంగా అరెస్టు చేస్తున్నదని చెప్పారు. తనపై చేసినవన్నీ నిరాధార, తప్పుడు ఆరోపణలేనన్నారు. ఇలాంటి వాటికి భయపడబోమని.. పోరాటం చేస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై బీజేపీ వివాదాస్పద ఫొటో.. రావణుడితో పోల్చి..
Comments
Please login to add a commentAdd a comment