
కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి భార్య లక్ష్మి పూరి (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి భార్య లక్ష్మి మురుదేశ్వరి పూరిపై సామాజిక కార్యకర్త సాకేత్ గోఖేల్ చేసిన ట్వీట్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్త చేసింది. తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించింది. సామాజిక కార్యకర్త గోఖలే ఇటీవల హర్‌దీప్ సింగ్ పూరి భార్యపై కొన్ని వివాదాస్పద ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్ల విషయంలో లక్ష్మి పూరి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
కార్యకర్త గోఖలే జూన్ 13, జూన్ 26 న, చేసిన ట్వీట్లలో స్విట్జర్లాండ్‌లో లక్ష్మి పూరి కొంత ఆస్తి కొనుగోలు చేశారని ఆరోపించడమే కాక, ఆమె భర్త మీద కూడా పలు ఆరోపణలు చేశారు. ఇలా తప్పుడు ట్వీట్లు చేసిన గోఖలే తనకు 5 కోట్లు చెల్లించాలంటూ అతడిపై లక్ష్మి పూరి పరువునష్టం దావా వేశారు. ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఈ కేసును విచారించింది.
ఈ నేపథ్యంలో కార్యకర్త సాకేత్ గోఖలేకు ఢిల్లీ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. లక్ష్మి పూరిపై చేసిన ట్వీట్లను 24 గంటల్లో తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జస్టిస్ సీ హరిశంకర్ తన తీర్పులో తెలిపారు. ఒకవేళ గోఖలే తను చేసిన ట్వీట్లను తొలగించకుంటే.. ట్విట్టర్ సంస్థే వాటిని డిలీట్ చేస్తుందన్నారు. అంతేకాక కోర్టు గోఖలేకు సమన్లు జారీ చేయడమే కాక సెప్టెంబర్ 10 న జాయింట్ రిజిస్ట్రార్ ముందు కేసును జాబితా చేసేలోగా నాలుగు వారాల్లో తన లిఖితపూర్వక ప్రకటనను దాఖలు చేయాలని ఆదేశించింది..