లిక్కర్‌ కేసులో ఈడీ దూకుడు.. మళ్లీ కేజ్రీవాల్‌ విచారణ | Delhi LG Grants Permission for Prosecution of Arvind Kejriwal in Liquor Policy Scam | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసులో ఈడీ దూకుడు.. మళ్లీ కేజ్రీవాల్‌ విచారణ

Published Sat, Dec 21 2024 12:07 PM | Last Updated on Sat, Dec 21 2024 3:07 PM

Delhi LG Grants Permission for Prosecution of Arvind Kejriwal in Liquor Policy Scam

ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్‌ తగిలింది. కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారం (డిసెంబర్‌ 21) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చారు.

డిసెంబరు 5న ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఈడీ ఆరోపించింది. కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను అనుమతి కోరింది.  తాజాగా,లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చారు. దీంతో మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ విచారించనుంది.

 

మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ అరెస్ట్‌,విడుదల
మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఈడీ అరెస్ట్‌ చేసింది.  ఈ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. సెప్టెంబర్‌ 13న కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన ఆరు నెలల త్వరాత తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

మద్యం పాలసీ కేసు కథేంటీ?
ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్‌ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్‌ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్‌ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది.

అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్‌ హోల్‌సేల్‌ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్‌ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్‌ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది.

దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్‌ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్‌ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి.

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ హీట్

రూపకల్పన నుంచే అక్రమాలంటూ.. 
ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్‌ నేతలకు రూ.వందల కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషిట్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్‌ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ.. అరెస్టు చేసింది.ఇదే కేసులో కేజ్రీవాల్‌, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌‌ సిసోడియాలు సైతం జైలు శిక్షను అనుభవించారు. బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా, కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఈడీకి అనుమతివ్వడం చర్చాంశనీయంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement