Updates
► సీబీఐ కస్టడీలో కవిత విచారణ కొనసాగుతోంది. సీబీఐ కేంద్ర కార్యాలయంలో ఇంటరాగేషన్ జరుగుతోంది. రూమ్ నంబర్ 302లో విచారణ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను సీబీఐ మహిళా అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసి అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది.
► సీబీఐ కస్టడీలో ఉన్న కవిత ఇంటరాగేషన్ సీబీఐ కేంద్ర కార్యాలయంలో కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసి అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాఫ్ చాట్‌పై సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది.
► మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవి పర్యవేక్షణలో సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది. సీబీఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు జరగనున్నాయి. సీబీఐ కస్టడీలో ప్రతి రోజు సాయంత్రం 6-7 గంటల మధ్య కవితను కలిసేందుకు న్యాయవాది, సభ్యులకు అనుమతి ఉంది. కవిత భర్త అనిల్, కేటీఆర్, పీఏ శరత్ న్యాయవాది మోహిత్ రావు కలిసేందుకు అనుమతి ఉంది.
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ పాలసీ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేటి నుంచి విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అనూహ్యరీతిలో సీబీఐ ఆమెను అరెస్ట్ చేయగా.. రౌస్ అవెన్యూ కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఇవాళ(శనివారం) తొలిరోజు కవిత ఇంటరాగేషన్ ప్రారంభం కానుంది.
సాక్ష్యాలను ముందు పెట్టి సీబీఐ అధికారులు కవితను విచారణ చేయనున్నట్లు సమాచారం. బుచ్చిబాబు-కవిత మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంటరాగేషన్ జగరనున్నట్లు తెలుస్తోంది. అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, దినేష్ అరోరా శరత్ చంద్రారెడ్డితో పాటు అభిషేక్ బోయినపల్లి అశోక్ కౌశిక్ వాంగ్మూలాలను చూపించి సీబీఐ కవితను ప్రశ్నించే అవకాశాలున్నాయి.
ఇక.. నిన్న( శుక్రవారం) కవితను మూడు రోజుల కస్టడీకి కోర్టు అప్పగించిన విషయం తెలిసిందే. ఈనెల 15 వరకు కవిత సీబీఐ కస్టడీలో ఉండనుంది. సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో కవిత విచారణ జరగనుంది. కవితను సీబీఐ కస్టడీలో కలిసేందుకు సోదరులు కేటీఆర్, భర్త అనిల్, కవిత పిల్లలు, పీఏ శరత్ కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా కస్టడీలో కవితకు ఇంటిభోజనం, జపమాల, పుస్తకాలు, బెడ్లను కోర్టు అనుమతించింది.
కవిత రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ విషయాలు
కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు కస్టడీ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి.. కవిత జాగృతి సంస్థకు రూ. 80లక్షల ముడుపులు చెల్లించారు. డబ్బులకోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సిబిఐ తెలిపింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని కవిత శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్లు సీబీఐ పేర్కొంది.
నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు 80లక్షలు శరత్ చంద్రారెడ్డి చెల్లించారన్న సిబిఐ. మహబూబ్‌నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తను రూ.14కోట్లు ఇవ్వలేనన్న శరత్ చంద్రారెడ్డి.
రూ.14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు సీబీఐ పేర్కొంది. ఒక్కో రిటైల్ జోన్ కి రూ.5 కోట్లు చెప్పున 5 రిటైల్ జోన్లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత 50 కోట్లు డిమాండ్ చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారన్నసీబీఐ.
కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్కి కవితే రూ.100కోట్లు చెల్లించారు. ఇండో స్పిరిట్‌లో 65శాతం వాటా పొందారు. గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారు. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడు. ఈ విషయాలన్నింటి పైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదు అని సీబీఐ పేర్కొంది. అందుకే ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాలని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది.
కవిత అరెస్టు అక్రమం..
కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. ‘కవిత అరెస్టు అక్రమం. కవితను కస్టడీలో ఉంచాలనేది సీబీఐ ధ్యేయంగా కనబడుతోంది. కవిత ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ. జాతీయ రాజకీయ పార్టీలో కవిత మాస్ లీడర్. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో అరెస్ట్ చేయడమనేది కీలకం. కవిత ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అరెస్టులో నిబంధనలు పాటించలేదు. దర్యాప్తుకు సహకరించకపోవడం అరెస్టుకు కారణంగా ఉండొద్దని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పింది. సెక్షన్ 41 దుర్వినియోగం చేశారు’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment