Delhi Liquor Scam: ఈడీ చార్జిషీట్‌లో కేజ్రీవాల్‌ పేరు | Delhi Liquor Scam: CM Kejriwal Hits Out ED, Chargesheet Completely Fictional | Sakshi
Sakshi News home page

Delhi Liquor Scam: ఈడీ చార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్‌ పేరు.. స్పందించిన సీఎం!

Published Thu, Feb 2 2023 6:07 PM | Last Updated on Fri, Feb 3 2023 4:43 AM

Delhi Liquor Scam: CM Kejriwal Hits Out ED, Chargesheet Completely Fictional - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణానికి సంబంధించి ఈడీ గురువారం అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరును చేర్చింది. సౌత్‌ గ్రూపు నుంచి రూ.100 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌నాయర్‌ తన మనిషి అని, విజయ్‌ను నమ్మొచ్చని ఫేస్‌టైం కాల్‌లో సమీర్‌ మహేంద్రుతో కేజ్రీవాల్‌ అన్నారని పేర్కొంది. కేజ్రీవాల్‌ను ఎవరెవరు కలిసిందీ, ఎవరెవరు ఫోన్‌లో మాట్లాడిందీ తెలిపింది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లను మరోమారు ప్రస్తావించింది. ఈడీ దాఖలు చేసిన 428 పేజీల సప్లిమెంటరీ చార్జిషీట్‌ను రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇందులో పేర్కొన్న నిందితులు విజయ్‌నాయర్, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్‌ అరోరాలతో పాటు ఏడు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది.  

కిక్‌బ్యాక్‌లపై చర్చించారు!
స్కామ్‌లో కీలక వ్యక్తులతో పాటు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వారి స్టేట్‌మెంట్లను చార్జిషీట్‌కు ఈడీ జత చేసింది. అరుణ్‌పిళ్‌లై కవిత తరఫు ప్రతినిధిగా ఇండో స్పిరిట్స్‌లో చేరారని తెలిపింది. సౌత్‌ గ్రూపునకు చెందిన కవిత, మాగుంట, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డిలు ఎవరెవరితో మాట్లాడారు? ఎవరెవరితో ఎక్కడ సమావేశమయ్యారన్న అంశాలు పొందుపరిచింది. కిక్‌బ్యాక్‌ల రూపంలో ముందుగా పెట్టుబడి ఎలా తిరిగి రాబట్టాలనే అంశాన్ని పెట్టుబడిదారులు చర్చించారని పేర్కొంది.

విజయ్‌నాయర్‌ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించాడని పేర్కొంది. మనీలాండరింగ్‌ కేసు పెట్టడానికి తగిన కారణాలున్నాయని తెలిపింది. సౌత్‌ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ మాగుంట, శరత్‌రెడ్డిలు భాగస్వాములు అని తెలిపింది. సౌత్‌ గ్రూపునుంచి ఆప్‌ నేతలకు సొమ్ములు ఎలా చేరాయో వివరించింది. ఎవరెవరిని ఏయే కారణాలతో అరెస్టు చేసిందీ తెలియజేసింది. సౌత్‌గ్రూపు నుంచి తీసుకున్న రూ.100 కోట్లలో రూ.30 కోట్లు గోవా ఎన్నికలకు ఆప్‌ ఖర్చు చేసినట్లు ఆరోపించింది.   

కవిత, ఆమె భర్తతో భేటీ అయ్యా: సమీర్‌ మహేంద్రు  
తన వాటా నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా ఎహెడ్‌లకు రూ.1 కోటి, రూ.70 లక్షలు చొప్పున ఇండో స్పిరిట్స్‌ నుంచి జమ చేయాలని అరుణ్‌పిళ్లై సూచించారు. శరత్‌చంద్రారెడ్డికి ఐదు జోన్లు, ఎంఎస్‌రెడ్డికి రెండు జోన్ల ద్వారా ఇండో స్పిరిట్స్‌లో రూ.5 కోట్ల పెట్టుబడితో రూ.17 కోట్లు ఆర్జించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డితో ఢిల్లీ నివాసంలో రెండు, మూడుసార్లు భేటీ అయి మద్యం వ్యాపారంపై మాట్లాడా. ఈ సమయంలో మాగుంట కుమారుడు రాఘవ, బుచ్చిబాబు ఉన్నారు. అ

రుణ్‌పిళ్లై అతని అనుయాయులు అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబులతో మాట్లాడడానికి విజయ్‌నాయర్‌ జూమ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. అరుణ్, అభిషేక్, బుచ్చిబాబులకు రాజకీయ పలుకుబడి ఉందని వారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు స్నేహితులని విజయ్‌నాయర్‌ చెప్పారు. అరుణ్‌తో ఫోను సంభాషణల్లో కవిత పేరు వచ్చింది. ఇండో స్పిరిట్స్‌ వెనక ఎవరు ఉన్నారో చెప్పాలని అరుణ్‌పిళ్లైను అడగ్గా తెలంగాణ సీఎం కుమార్తె కవిత ఉన్నారని, ఆమె తరఫు తాను ప్రతినిధినని చెప్పారు.  హైదరాబాద్‌ వెళ్లి కవిత ఇంట్లో కవిత, భర్త అనిల్‌తో భేటీ అయ్యా. అరుణ్‌ తమ కుటుంబానికి సన్నిహితుడని ఇప్పటికే కలిసి వ్యాపారం చేస్తున్నామని కవిత చెప్పారు.   
 

కేజ్రీవాల్, సిసోడియాలతో భేటీ అయ్యా: దినేష్‌ అరోరా
తొలుత  సంజయ్‌ సింగ్‌ను కలిశా. అతని ద్వారా మనీష్‌ సిసోడియాను హోటల్‌లో కలిశా. సంజయ్‌ సింగ్‌ విజ్ఞప్తి మేరకు ఇతర హోటళ్ల యాజమాన్యాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఖర్చుల నిమిత్తం రూ.82 లక్షల చెక్కులు ఇచ్చాయి. ఐదు, ఆరు సార్లు సిసోడియాతో మాట్లాడడంతోపాటు ఒకసారి   సంజయ్‌సింగ్‌తో కలిపి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం కేజ్రీవాల్‌తో భేటీ అయ్యా. తొలుత విజయ్‌నాయర్‌తో పరిచయం అయింది.

అనంతరం అర్జున్‌ పాండే, అరుణ్‌పిళ్లై , బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లిలను నాయర్‌ పరిచయం చేస్తూ వీరికి తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, ఏపీ ఎంపీ ఎంఎస్‌రెడ్డిలకు బాగా దగ్గరవారని తెలిపారు. సౌత్‌ గ్రూపు విజయ్‌ నాయర్‌కు రూ.100 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చింది. బిజినెస్‌లో సౌత్‌గ్రూప్‌కు ఆరుశాతం కిక్‌బ్యాక్‌ కింద మొత్తంగా సుమారు రూ.210 కోట్లు వస్తుంది. సౌత్‌ గ్రూపునకు రూ.100 కోట్లు రికవరీ అయిన తర్వాత మిగిలిన రూ.100 కోట్లు విజయ్‌నాయర్‌ (ఆప్‌ కోసం), సౌత్‌ గ్రూపు పంచుకుంటారు. మద్యం వ్యాపారంపై చర్చించడంతోపాటు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.100 కోట్లు ఎలా రికవరీ అవుతుందో కూడా చర్చించాం.  

రూ.19 కోట్లు కాదు..రూ.32 కోట్లు తీసుకున్నా: అరుణ్‌  
నవంబర్, డిసెంబర్‌ 2021ల్లో విజయ్‌నాయర్‌ ఫోన్‌ చేసి ఢిల్లీలోని ఇండియా హ్యాబిటెట్‌ సెంటర్‌లో కలవమన్నారు. ఇండో స్పిరిట్స్‌ నుంచి రూ.19 కోట్లు తీసుకున్నట్టుగా గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ తప్పు. రూ.32 కోట్లు తీసుకున్నా. దీంట్లో రూ.25 కోట్లు నేరుగా నా ఖాతాలోకే వెళ్లాయి. ఒక ఈవెంట్‌ నిమిత్తం ఆంధ్రప్రభ పబ్లికేషన్స్‌కు ఇండో స్పిరిట్స్‌ ద్వారా రూ.1 కోటి, ఇండియా ఎహెడ్‌కు రూ.70 లక్షలు అందజేశా.

గచ్చిబౌలిలోని శ్రీహిల్స్‌ దగ్గర నాలుగు  ఎకరాలు కొనుగోలు నిమిత్తం వేముల హరి ద్వారా క్రియేటివ్‌ డెవలపర్స్‌కు రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చా. మార్చి 2021లో శరత్‌రెడ్డితో పాలసీ మార్పుపై చర్చించాం. మే 2021న బంజరాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో అభిషేక్‌ బోయినపల్లిని కలిశా. అక్కడే శరత్‌రెడ్డికి అభిషేక్‌ను పరిచయం చేశా. ఢిల్లీ సీఎం కార్యాలయం పక్కనే విజయ్‌ నాయర్‌ నివాసం ఉంటారు.

ఆప్‌ సోషల్‌ మీడియా చూసేది కూడా విజయ్‌నాయర్‌ కావడంతో అతడిపై కేజ్రీవాల్‌కు పూర్తి నమ్మకం ఉంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో రాఘవ, నాగరాజరెడ్డిలు కూడా పాల్గొన్నారు. న్యూ పాలసీపై ఢిల్లీ సీఎంతో తాను మాట్లాడానని, కేజ్రీవాల్‌ తనని ఢిల్లీ లిక్కర్‌ ట్రేడ్‌కు ఆహ్వానించారని మాగుంట తెలిపారు.

ఇండో స్పిరిట్స్‌లో ఎమ్మెల్సీ కవిత తరఫున భాగస్వామిని. కవితకు చాలా కాలంగా స్నేహితుడిని. ఇండో స్పిరిట్స్‌ లాభాలతో ఏం చేయాలనేది ఇంకా డిసైడ్‌ చేసుకోలేదు. సమీర్‌ మహేంద్రు, కవితలు ఫేస్‌ టైంలో మాట్లాడుకునే ఏర్పాటు చేశా. ఒకసారి హైదరాబాద్‌లో నేరుగా కలుసుకునే ఏర్పాటు చేశా. ఇండో స్పిరిట్స్‌లో అసలు పెట్టుబడిదారు కవిత అని సమీర్‌ మహేంద్రుకు చెప్పా. శరత్‌రెడ్డి హోల్‌సేల్‌ బిజినెస్‌లో ఎంటర్‌ కాలేదు.  

అభిషేక్‌ పలుమార్లు డబ్బిచ్చారు: గౌతమ్‌ ముత్తా‡
ఇండియా ఎహెడ్‌ న్యూస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐఏఎన్‌పీఎల్‌)లో పెట్టుబడులు పెట్టాలని అభిషేక్‌ బోయినపల్లిని కోరా. పెట్టుబడి మొత్తం కంపెనీ ఖాతాకు కాకుండా నాకు ఇవ్వాలని కోరా. ఐఏఎన్‌పీఎల్‌కు రూ.50 లక్షల చెక్కు అభిషేక్‌ ఇచ్చారు. దీన్ని కొన్ని కారణాల వల్ల తిరిగి ఇచ్చేశా. ఛానల్‌ నడపడానికి వ్యక్తిగతంగా ఇవ్వాలని కోరగా 10.11.2020న రూ.1.08 కోట్లు బదిలీ చేశారు.

అనంతరం జెడ్‌ఎన్‌పీఎల్‌ షేర్లు రూ.5.80 కోట్లకు కొనుగోలు చేసి నన్ను, అభిషేక్‌ను డైరెక్టర్లుగా అపాయింట్‌ చేయాలని కోరా. దీని నిమిత్తం జెడ్‌ఎన్‌పీఎల్‌కు రూ.75 లక్షల రుణం ఇచ్చా. దీన్ని షేర్ల కొనుగోలులో అడ్జస్ట్‌ చేశారు. అనంతరం ఇండియా ఎహెడ్‌ ఐపీఆర్‌ సొంతమైన ఆంధ్రప్రభ పబ్లికేషన్‌ లిమిటెడ్‌కు రూ.1.30 కోట్లు బదిలీ చేశా. ఇండియా ఎహెడ్‌ ట్రేడ్‌మార్క్‌ను నా పేరుమీద బదిలీ చేసుకున్నా. ఈ క్రమంలో పలుతేదీల్లో  అభిషేక్‌ రూ.6.53 కోట్లు బదిలీ చేశారు.  

సమీర్‌ తదితరులతో సమావేశమయ్యా:
అభిషేక్‌ బోయినపల్లి స్టేట్‌మెంట్‌: విజయ్‌ నాయర్‌ ఆప్‌కు బాగా దగ్గర. విజయ్‌ ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ 2021–22 రూపొందించారని అరుణ్‌ పిళ్‌లై తెలిపారు. శరత్‌చంద్రారెడ్డి రిటైల్‌ జోన్స్‌ రన్‌ చేయడానికి ఆసక్తి చూపారు. తాజ్‌ హోటల్‌లో సమీర్‌ మహేంద్రు, అరుణ్‌పిళ్‌లై, శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాజేశ్‌ మిశ్రా బినోయ్‌బాబు, బుచ్చిబాబులతో సమావేశమయ్యా.

10 రిటైల్‌ ఎల్‌7 లైసెన్సులు మాగుంట, సమీర్‌మహేంద్రు, శరత్‌రెడ్డిలకు వచ్చినందుకు సెలబ్రేట్‌ చేసుకున్నాం. సమీర్‌కు రెండు, మాగుంటకు మూడు, శరత్‌రెడ్డిలకు ఐదు ఎల్‌7 లైసెన్సులు వచ్చాయి. అరుణ్, బుచ్చిబాబు, విజయ్‌నాయర్‌తో మరోసారి సమావేశమయ్యా. ఈ సమయంలోనే గౌతమ్‌ ముత్తాకు రూ.75 లక్షలు ఎందుకు ఇచ్చారన్న అంశంపై చర్చ జరిగింది. 
సంబంధిత వార్త: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సంచలనం.. ఈడీ చార్జ్‌షీట్‌ దాఖలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement