సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో రైలు ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధిస్తూ ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ ( డిఎంఆర్సి ) నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలనుంచి ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, భత్యాలను 50 శాతం తగ్గించనున్నట్లు మంగళవారం డిఎంఆర్సి ఒక ఉత్తర్వులో పేర్కొంది. మార్చి 22న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 1500 కోట్ల మేర నష్టం వాటిల్లినందున ఉద్యోగుల జీతంలో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో సేవలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో డిఎంఆర్‌సి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దాదాపు ఐదు నెలలుగా మెట్రో సేవలు నిలిచిపోయినందున తీవ్ర ఆర్థిక భారం నేపథ్యంలో ఉత్యోగుల జీతభత్యాలను 50 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. (రూ.3,756 కోట్లు ప్లీజ్)
ఢిల్లీ మెట్రో రైలు ఉద్యోగులకు లభించే అన్ని రకాల అడ్వాన్సులను తదుపరి ఉత్తర్వుల వరకు నిషేధించారు. అయితే ఇప్పటికే అనుమతి పొందిన వారికి మాత్రమే అడ్వాన్సులు ఇస్తారు. అయితే మెట్రో ఉద్యోగులు వైద్య చికిత్స, టీఏ, డీఏ వంటి ఇతర సౌకర్యాలను ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించారు. దేశంలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి మెట్రో మినహా దాదాపు అన్ని రవాణా సౌకర్యాలకు అనుమతించారు. ఈ నేపథ్యంలో మెట్రో తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో గతంలో రైల్వే కార్పేరేషన్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి తీసుకున్న 35,198 కోట్ల రుణాన్ని ఇప్పటి పరిస్థితుల్లో తిరిగి చెల్లించడం సాధ్యం కాదని కేంద్రానికి లేఖ రాసింది. వచ్చే ఏడాది వరకు రుణాన్ని వాయిదా వేయాలని డిఎంఆర్‌సి గత నెలలోనే లేఖ రాసింది. ఈ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 1242.83 కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లించాల్సి ఉందని డిఎంఆర్‌సి అధికారి ఒకరు వెల్లడించారు. (రిలయన్స్ చేతికి నెట్‌మెడ్స్ )
Comments
Please login to add a commentAdd a comment