అయోధ్యలో బాలరాముడు కొలువైనది మొదలు ఆ ప్రాంతపు తీరు తెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అయోధ్య ఆర్థిక వ్యవస్థ ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. అయోధ్యకు ప్రతిరోజూ రెండు నుండి మూడు లక్షల మంది రామభక్తులు తరలివస్తున్నారు.
అయోధ్యకు వస్తున్నవారంతా ఎంతో ఉత్సాహంతో శ్రీరామునికి సంబంధించిన వస్తువులను కొనుగులు చేస్తున్నారు. రామాలయంలో దర్శనం ముగించుకున్నాక భక్తులు శ్రీరాముని చిత్రపటాలను కొనుగోలు చేసేందుకు షాపింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్య మార్కెట్‌లో చిన్న సైజు శ్రీరాముని చిత్రపటం నుంచి పెద్ద సైజు చిత్రపటం వరకూ అన్నీ విరివిగా అమ్ముడవుతున్నాయి. అలాగే రామాలయం నమూనా చిత్రం, కీ చైన్, స్టిక్కర్, మాగ్నెట్ స్టాండ్, లాకెట్, బాలరాముని చిత్రాన్ని ముద్రించిన జెండాతో సహా 20 నుండి 30 రకాల వస్తువులను భక్తులు కొనుగోలు చేస్తున్నారు.
అయోధ్యకు చెందిన వ్యాపారి అశ్వనీ గుప్తా మాట్లాడుతూ, రాముని చిత్రాలను భక్తులు ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇది తమ వ్యాపారస్థాయిని విపరీతంగా పెంచుతున్నదన్నారు. ఫలితంగా చాలామందికి ఉపాధి కూడా లభిస్తున్నదన్నారు. అయోధ్యలో భక్తుల రద్దీ పెరగడంతో ఇక్కడి వ్యాపారాలు కూడా బాగా సాగుతున్నాయి. ముఖ్యంగా బాలరాముని చిత్రాలకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. కోట్ల రూపాయల మేరకు బాలరాముని చిత్రాల వ్యాపారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment